రెండు దసరాలు పాయె..

Double bedroom house was not ready till now - Sakshi

‘డబుల్‌’ ఇళ్లు మాత్రం పూర్తి కాలేదాయె.. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఒక్కటీ సిద్ధం కాని వైనం శంకుస్థాపన జరిగి రెండేళ్లయినా గాడిన పడని పనితీరు గిట్టుబాటు కాదని వెనకడుగేస్తున్న కాంట్రాక్టర్లు.. జిల్లాల పనితీరుపై గృహ నిర్మాణ శాఖ జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రెండు దసరా పండుగలు దాటినా డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకంలో గృహ ప్రవేశాల బాజాలు మోగడం లేదు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ సహా ఇతర పథకాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నా.. ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో  కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేదు. ఇసుకను ఉచి తంగా.. సిమెంటు, స్టీల్‌ను తక్కువ ధరలకే ప్రభుత్వం ఇస్తున్నా ముందుకు రావట్లేదు. యూనిట్‌ కాస్ట్‌– నిర్మాణ వ్యయం మధ్య పెద్దగా తేడా లేక పనులు గిట్టుబాటు కావని వెనుకంజ వేస్తుండటంతో డబుల్‌ బెడ్రూం పనులు శంకుస్థాపన దశలోనే ఉన్నాయి. 

2015లో అన్ని జిల్లాల్లో ఒకేసారి.. 
2015 దసరా నాడు అన్ని జిల్లాల్లో ఒకేసారి డబుల్‌ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల యినా 18 జిల్లాల్లో ఇప్పటికీ ఒక్క ఇంటి గృహ ప్రవే శం జరగలేదు. కొందరు మంత్రులు కాంట్రాక్టర్లతో సమావేశమై వారిని ఒప్పించేందుకు చేస్తున్న యత్నా లు ఫలిస్తుండటంతో ఆ జిల్లాల్లో పనులు జరుగు తున్నాయి. మిగతా చోట్ల మాత్రం ఎక్కడ వేసిన గొం గళి అక్కడే అన్న చందంగా ఉంది. ‘డబుల్‌’ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ తాజాగా సీఎం కేసీఆర్‌కు  నివేదిక అందజేసింది. మెరుగైన పనితీరు, సాధారణ పురోగతి, తక్కువ పురోగతి కేటగిరీలుగా జిల్లాలను విభజించి నివేదిక రూపొందించింది. అనుమతులు ఇచ్చిన, టెండర్లు ఫైనల్‌ చేసిన ఇళ్ల సంఖ్యను ప్రాతిపదికగా చేసుకుని పనితీరును మదించింది. 

జీహెచ్‌ఎంసీలో 40,362 ఇళ్ల పనులు మొదలు
తాజా నివేదికలో సిద్దిపేట జిల్లా  తొలి స్థానంలో, జీహెచ్‌ఎంసీ రెండో స్థానంలో ఉన్నాయి. సిద్దిపేటకు ప్రభుత్వం 11,960 ఇళ్లు కేటాయించగా.. 10,647 ఇళ్లకు అనుమతులిచ్చింది. వీటిలో 9,330 ఇళ్లకు గానూ 9,035 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇందు లో 8,137 ఇళ్ల పనులు మొదలయ్యాయి. జీహెచ్‌ ఎంసీలో లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు పరిపాలన అనుమతులిస్తే.. 69,564 ఇళ్లకు టెండర్లు ఖరారవగా, 40,362 ఇళ్ల పనులు మొదలయ్యాయి. తర్వాతి స్థానాల్లో కరీంనగర్, కామారెడ్డి జిల్లాలున్నాయి.  

సగం కంటే ఎక్కువ జిల్లాల్లో సున్నా..
టెండర్లు ఖరారు కావటమే పనితీరుకు గీటురాయిగా భావిస్తూ జాబితా రూపొందించిన అధికారులు.. 18 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా సిద్ధమవని విషయం విస్మరించారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని పేర్కొన్న అధికారులు.. టెండర్లు ఖరారైన ఇళ్ల సంఖ్య మెరుగ్గా ఉందని మెరుగైన పనితీరున్న జిల్లాల జాబితాలో చూపారు. రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, వరంగల్‌ అర్బన్, మెదక్, మహబూ బాబాద్, సంగారెడ్డి, జనగామ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, వరంగల్‌ రూరల్, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నిర్మల్, మంచిర్యాల, రంగారెడ్డి, వికారాబాద్, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్క ఇల్లూ సిద్ధం కాలేదన్నారు. 

వచ్చే దసరాకైనా..
కొత్తగా శంకుస్థాపన చేసిన కలెక్టరేట్‌ భవనాలు వచ్చే దసరా లోపు పూర్తవుతాయని అధికారులు గట్టిగా చెబుతున్నారు. కానీ.. డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో మాత్రం వారి నుంచి ఆ భరోసా రావటం లేదు. ఇళ్లకు శంకుస్థాపనల తర్వాత ఇప్పటికే రెండు దసరాలు వెళ్లిపోయాయి. కనీసం వచ్చే దసరా నాటికైనా సింహభాగం ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు చెప్పలేకపోతున్నారు.

సీఎం దత్తత గ్రామాల్లో సిద్ధం..
గజ్వేల్‌ నియోజకవర్గంలో.. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఇప్పటికే పూర్తి ఇళ్లను సిద్ధం చేయటం, సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌ చొరవ తీసుకోవడంతో పనులు మెరుగ్గా జరుగుతున్నాయి. దుబ్బాక పనితీరులో ముందంజలో ఉంది. జీహెచ్‌ఎంసీలోనూ మంచి స్పందన వస్తోంది. డబుల్‌ బెడ్రూం ఇళ్లలో జోగుళాంబ గద్వాల జిల్లా వెనుకబడి ఉంది. జిల్లాకు 2,800 ఇళ్లు మంజూరైతే 600 ఇళ్లకు పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో అన్ని ఇళ్లకు టెండర్లు పిలిస్తే 40కి మాత్రమే ఖరారయ్యాయి. అందులోనూ 20 ఇళ్ల పనులే మొదలయ్యాయి. కుమురం భీం, వికారాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, వనపర్తి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలు చివరి కేటగిరీలో నిలిచాయి.

ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లు    :    2,68,245
పరిపాలన అనుమతులు జారీ అయినవి    :    2,06,518
టెండర్లు పిలిచినవి: 1,78,913   ఖరారైనవి    :    1,19,422
పనులు మొదలైనవి: 68,564   పూర్తయినవి:    2,771
విడుదల / వ్యయం అయిన నిధులు    :     రూ.529 కోట్లు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top