బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు

dogs Bytes  Increases In Karimnagar - Sakshi

సాక్షి, హుజూరాబాద్‌( కరీంనగర్‌) : గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలే ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహా లుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 107 గ్రామాలు ఉండగా, ప్రతి గ్రామంలో సుమారు 200 నుంచి 500 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. గ్రామాల్లో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తూ, కనబడినవారిపై దాడి చేస్తుండడంతో ప్రజలు కంటి మీద కనుకు లేకుండా పోయింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్‌ నెల వరకు ఆయా పీహెచ్‌సీలలో కుక్కకాటుకు గురైన బాధితులు హుజూరాబాద్‌లో 119, జమ్మికుంటలో 201, వీణవంకలో 62, సైదాపూర్‌లో 107, ఇల్లందకుంటలో49 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

స్వేచ్ఛగా సంచారం..
గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. నియోజకవర్గంలోని వీణవంక, హుజూరా బాద్, జమ్మికుంట మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. హుజూరాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో కుక్క కాటుకు గురవుతున్న బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. కుక్కల సమస్యకు నిలయంగా సిర్సపల్లి గ్రామం నిలిచింది. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన శ్రీశాంత్‌(3) అనే చిన్నారిపై గ్రామంలో కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. 

బయపడుతున్న జనం..
కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు సరిగ్గా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా సేద తీరుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండటంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణీంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మూగజీవాలపైనా దాడి..
నియోజకవర్గ వ్యాప్తంగా కుక్కల దాడిలో జనవరి నుంచి జూన్‌ మాసం వరకు పలువురి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. హుజూరాబాద్‌ మండలంలో గత వారం రోజుల వ్యవధిలో 6 పాడి గేదెలు, 4 ఆవులు, 8 లేగ దూడలు కుక్కల దాడిలో మృత్యువాత చెందటంతో పాడిపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 

పట్టించుకోని అధికార యంత్రాంగం..
కుక్కల సంఖ్య పెరగకుండా మున్సిపాలిటీల్లో, పీహెచ్‌సీ పరిధిలో జంతు సంతాన నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి. శునకాల నియంత్రణకు జంతు సంతాన నింయత్రణ ప్రాజెక్టు కింద 50 శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తుంది. మరో 50 శాతం నిధులను మున్సిపాలిటీల నుంచి సమకూర్చుకోని, వీధి కుక్కలకు టీకాలు వేయాల్సి ఉండగా, అధికా రులు పట్టించుకోకపోవడంతో కుక్కల బెడద తీవ్రమైందని పలువురు ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top