గిరిజన శక్తిని విచ్ఛిన్నం చేయొద్దు

Do not break tribal power - Sakshi

లంబాడీ జేఏసీ నేతలు

నేడు సరూర్‌నగర్‌లో లంబాడీల శంఖారావం   

సాక్షి, హైదరాబాద్‌: అన్నదమ్ముల్లా ఉన్న ఆదివాసీలు– లంబాడీల మధ్యలో చిచ్చుపెట్టి విభజించి–పాలించు అనే నినాదంతో కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని లంబాడీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంబాడీలపై జరుగుతున్న అసత్య ఆరోపణలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి సుమారు ఐదు లక్షల జనాభాతో బుధవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో ‘లంబాడీల ఆత్మగౌరవ శంఖారావం’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు. ఈ సభకు ఇంటికి ఒకరు చొప్పున కదలి రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లంబాడీ ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఆర్టికల్‌ 342–2, 108/1976 చట్టం ప్రకారం లంబాడీలను ఎస్టీలుగా చేర్చారని తెలిపారు. కానీ కొందరు లంబాడీలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ– గోండు సొమ్మును దోచుకొని తిన్నట్లు డిసెంబర్‌ 9న జరిగిన బహిరంగ సభలో అసభ్య పదజాలంతో మాట్లాడారని, లంబాడీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా అభివృద్ధి చెందారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.  

70 శాతమున్నా అందని పథకాలు  
రాష్ట్ర గిరిజనుల్లో 25 లక్షల జనాభా (70 శాతం) ఉన్న లంబాడీలకు ఒక ఎంపీ, 6.5 లక్షలు ఉన్న ఆదివాసీ తెగలకు ఒక ఎంపీ ఉన్నారన్నారు. 12 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు ఆదివాసీలు, ఏడుగురు లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల్లో 75 శాతం ఐటీడీఏలకు కేటాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక పథకాలు లంబాడీలకు అందడం లేదన్నారు. లంబాడీలకు 10 శాతం రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  సమావేశంలో రిటైర్డ్‌ అదనపు డీజీపీ డీటీ నాయక్, మాజీ మంత్రి టిలావత్‌ అమర్‌సింగ్, మాజీ మంత్రి జగన్‌ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం రాçష్ట్ర అధ్యక్షుడు కిషన్‌సింగ్, లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్యనాయక్, తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోతు శంకర్‌నాయక్‌ ఐక్యవేదిక నాయకుడు హనుమంత్‌ నాయక్‌  పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top