'ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ'

DK Aruna Slams On CM KCR Over Irrigation Projects In Mahabubnagar - Sakshi

మాజీ మంత్రి డీకే అరుణ

సాక్షి, మహబూబ్‌నగర్‌(గద్వాల) : కొత్త ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం ఆమె ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చిన్న కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఐదేళ్ల పాలన పూర్తయినా పూర్తి చేయలేకపోయారన్నారు. కృష్ణమ్మ దయతో జూరాలకు నీళ్లు వచ్చాయని, ఇక్కడ ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు రిజర్వాయర్ల వద్ద ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదన్నారు. తమ హయాంలో రైతులకు అన్ని విధాలా సహకరిస్తూ ఎడారి లాంటి నడిగడ్డ ప్రాంతంలో నెట్టెంపాడు ఎత్తిపోతలను చేపట్టానన్నారు.

మా హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని, అది ఇక్కడి రైతులకు తెలుసనన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చునన్నారు. కేసీఆర్‌ మొదటి నుంచి పాలమూరుపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కేసీఆర్‌వి బోగస్‌ మాటలని, ఆయన మాటలు వినే పరిస్థితిలో జనం లేరని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 99 ప్యాకేజీ, రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చేర్మన్‌ గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు రాంచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, టవర్‌ మక్బుల్, హన్మంతరాయ, నర్సింహులు, ఆది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top