విద్యుత్‌ చార్జీల్లో రాయితీ

Discounted in Power Charges Waterboard Relief Hyderabad - Sakshi

అన్ని కేటగిరీల్లో ప్రతి యూనిట్‌ చార్జీ రూ.3.95కు తగ్గింపు

జలమండలికి తగ్గనున్న రూ.కోట్ల భారం

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ

హర్షం వ్యక్తం చేసిన జలమండలి ఎండీ దానకిషోర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్లుగా జలమండలి ఎదుర్కొంటున్న అధిక విద్యుత్‌ చార్జీల భారం నుంచి విముక్తి లభించింది. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు‡ ప్రత్యేక చొరవతో విద్యుత్‌ చార్జీల తగ్గింపు జరిగింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి ఒక ఫేజ్‌ ద్వారా నగరానికి తాగునీటిని తీసుకువచ్చి సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.. నగరానికి ఈ నీటి అందజేత.. 95 శాతం భారీ మోటర్ల ద్వారా, 5 శాతం గ్రావిటీ ద్వారా జరుగుతోంది. భారీ మోటర్ల వినియోగం, రిజర్వాయర్ల ద్వారా వినియోగదారులకు నీటిని సరఫరా చేయడం కోసం నెలకు దాదాపుగా 200 నుంచి 225 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. విద్యుత్‌ చార్జీల రూపంలో రూ.90 కోట్లను చెల్లిస్తున్నారు. మహానగరానికి జలమండలి సరఫరా చేస్తున్న ఈ నీటిలో 95 శాతం వరకు గృహావసరాలు తీరుతున్నాయి. దీంతో విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు కల్పించాలని ప్రభుత్వానికి జలమండలి విజ్ఞప్తి చేసింది. జలమండలికి గుదిబండగా మారిన విద్యుత్‌ చార్జీల టారీఫ్‌ తగ్గించాలని జలమండలి అధికారులు 2018లోనే మంత్రికి విన్నవించారు.

సానుకూలంగా స్పందించిన కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఓకే చెప్పారు. ఈక్రమంలో జలమండలి టారీఫ్‌ తగ్గించాలని జీవో నెం.148ని 2018 ఆగస్టు 3న విడుదల చేశారు. అయితే ఈ జీవో ప్రకారం జలమండలి విద్యుత్‌ చార్జీల టారీఫ్‌ తగ్గింపులను ఈఆర్సీ అమలు చేయలేదు. దీంతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఈఆర్‌సీ అధికారులతో పలుమార్లు సమావేశమై విద్యుత్‌ బిల్లుల టారీఫ్‌లు తగ్గించారు. విద్యుత్‌ శాఖ యాక్ట్‌ 108/2003 ప్రకారం ఈ రాయితీలు కల్పించారు.

రాయితీలు ఇలా...
ఇంతకుముందు జలమండలికి 11కేవీ విద్యుత్‌కి రూ.6.65, 33 కేవీ విద్యుత్‌కి రూ.6.15, 133 కేవీ, ఆపైన విద్యుత్‌కి రూ.5.65లు యూనిట్‌కి చొప్పున వసూలు చేసేవారు. తాజాగా ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని కేటగిరీలో ప్రతి యూనిట్‌కి రూ.3.95 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ టారీఫ్‌ రాయితీ ఏప్రిల్‌ 2018 నుంచే అమలులోకి రానుండటం విశేషం. దీనివల్ల జలమండలికి రూ.700 కోట్లు మిగలనున్నాయి. ప్రతినెలా జలమండలికి దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా  కానుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.270 కోట్ల భారం తప్పనుంది. రాయితీ లేకముందు నెలకు        దాదాపుగా రూ.90 కోట్లు విద్యుత్‌ చార్జీల రూపంలో చెల్లించేవారు. రాయితీ అనంతరం నెలకు  దాదాపుగా రూ.22.5 కోట్లు ఆదా కానున్నాయి. మిగులు చార్జీలతో నగరంలో మెరుగైన నీటి సరఫరా, సీవరేజ్‌ పనులు చేపట్టవచ్చు. జలమండలికి విద్యుత్‌ టారీఫ్‌లో రాయితీ కోసం కృషి చేసిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top