విద్యుత్‌ సేవలపై 18 శాతం జీఎస్టీ

Discoms Charges GST On New Electricity Connections In Telangana - Sakshi

2017 జూలై తర్వాత జారీ చేసిన కొత్త కనెక్షన్లు, అదనపు లోడ్‌పై వడ్డింపు

జీఎస్టీ కమిషనరేట్‌ ఆదేశంతో విధించిన డిస్కంలు

ఫిబ్రవరి నెల బిల్లుల్లో జీఎస్టీ బకాయిల వసూళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేలాది మంది విద్యుత్‌ వినియోగదారులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మోత మోగింది. గత నెల వినియోగానికి సంబంధించి ప్రస్తుత నెలలో జారీ చేసిన విద్యుత్‌ బిల్లుల్లో విద్యుత్‌ చార్జీలకు అదనంగా జీఎస్టీని సైతం విధించడంతో బిల్లులు భారీగా పెరిగి వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి విద్యుత్‌ జీఎస్టీ పరిధిలోకి రాదు. కానీ కొత్త విద్యుత్‌ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్‌ మంజూరు సేవలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని జీఎస్టీ కమిషనరేట్‌ ఇటీవల రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు స్పష్టం చేసింది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై 1వ తేదీ నుంచి జారీ చేసిన కొత్త విద్యుత్‌ కనెక్షన్లు, మంజూరు చేసిన అదనపు లోడ్‌ విషయంలో సంబంధిత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయిలు వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో విద్యుత్‌ చార్జీలు మినహా విద్యుత్‌ సేవలకు సంబంధించిన అన్ని రకాల డెవల్‌మెంట్‌ చార్జీలపై 18 శాతం జీఎస్టీని డిస్కంలు విధిస్తున్నాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్‌తోపాటు ఇప్పటికే కనెక్షన్‌ కలిగి ఉండి అదనపు లోడ్‌ కోసం దరఖాస్తు చేసే వారి నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. అదే విధంగా 2017 జూలై నుంచి జారీ చేసిన కొత్త కనెక్షన్లతోపాటు అదనపు లోడ్‌ మంజూరు చేయించుకున్న పాత వినియోగదారుల నుంచి జీఎస్టీ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నెల విద్యుత్‌ బిల్లులతో కలిపి వసూలు చేస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top