గులాబీలో ముసలం! | differences in trs with join of kale yadaiah | Sakshi
Sakshi News home page

గులాబీలో ముసలం!

Published Sun, Nov 2 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరిక చేవెళ్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలకు రుచించడం లేదు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గులాబీ దళంలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరిక చేవెళ్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతలకు రుచించడం లేదు. మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన స్థానిక నాయకత్వంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. ఎన్నికల సమయంలో ఓటమికి కారకులైన యాదయ్యను ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ చేవెళ్ల నియోజకవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలకు విషయాన్ని వివరించేందుకు సిద్ధమయ్యారు.

 మంత్రికి ఫిర్యాదు..
 ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరికను వ్యతిరేకిస్తున్న చేవెళ్ల టీఆర్‌ఎస్ నేతలు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ ఓటమికి కారణమైన ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దనే సంకేతాలు వెళ్ళేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 ఇందులో భాగంగా ఓ కీలక నేత ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వద్దకు వెళ్లి తమ గోడు వెల్లడించే ప్రయత్నం చేశారు. కానీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని విషయాన్ని వివరించినట్లు సమాచారం.

 తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలపై పలు కేసులు బనాయించిన ప్రక్రియలో తాజా ఎమ్మెల్యే సహకారం ఉందని వారు ఆరోపించినట్లు తెలిసింది. చేవెళ్ల నేతల ఆందోళనను ఆలకించిన మంత్రి హరీష్‌రావు.. చివరకు ఆ నేతల్ని సర్దిచెప్పి పంపినట్లు సమాచారం.
 
మా లెక్క తేల్చాలి..
 ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేఎస్ రత్నం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాలె యాదయ్య చేతిలో ఓటమి పాలయ్యారు.
 
రత్నం గతంలో టీడీపీలో ఉండి.. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోవడం.. రాష్ట్రంలో పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఆయన కొంత ఆవేదనలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే పదవులు దక్కుతాయనుకున్న ఆయన.. ఓటమి బాధతో తీవ్ర మదనపడుతున్నారు.

 తాజాగా ఎమ్మెల్యే యాదయ్య చేరికతో తనకు రావాల్సిన అవకాశాల్ని కొత్త నేత ఎగరేసుకుపోతారనే సందిగ్ధం రత్నం వర్గీయుల్లో ఉంది. ఈ క్రమంలో పార్టీ తరఫున ఉన్న నేతలకు పదవులివ్వాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ముందగా హామీ ఇచ్చిన తర్వాతే కొత్త నేతల్ని చేర్చుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ నేత ‘సాక్షి’తో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement