తెలంగాణలో కొనసాగుతున్నపుష్కర రద్దీ | devotees rush pushkara ghats in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొనసాగుతున్నపుష్కర రద్దీ

Jul 20 2015 11:54 AM | Updated on Aug 1 2018 5:04 PM

తెలంగాణలోని పుష్కరఘాట్ల దగ్గర రద్దీ కొనసాగుతోంది.

హైదరాబాద్ : తెలంగాణలోని పుష్కరఘాట్ల దగ్గర రద్దీ కొనసాగుతోంది. భద్రాచలం,పర్ణశాల, మోతె, ధర్మపురి, కాళేశ్వరం, బాసర, పోచంపాడు క్షేత్రాల్లో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాల అనంతరం భక్తులు.. దైవదర్శనానికి బారులు తీరడంతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. భద్రాచలం రామాలయంలో దైవదర్శనానికి దాదాపు 4 గంటల సమయం పడుతోంది. ధర్మపురి, కాళేశ్వరం, బాసర తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు పోటెత్తారు. కాళేశ్వరంలో సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం పేరుతో రెండు వరుసల్లో దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వచ్ఛందసంస్థలు భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో భక్తుల పుష్కరస్నానాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల వరస సెలవులతో విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం బాసరలో భక్తులు సాధారణస్థాయిలో ఉన్నారు. మహారాష్ట్ర నుంచి బాసర వద్ద గోదావరి వచ్చే వరదనీరు తగ్గింది. పుష్కరస్నానానికి సరిపడా నీళ్లు లేకపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలోని సోన్‌, గూడెం, మంచిర్యాల, చెన్నూరు పుష్కరఘాట్లలోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. మంచిర్యాలలో చినజీయర్‌స్వారి పుష్కర యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది.

కరీంనగర్‌ జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ధర్మపురం, కాళేశ్వరం పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ధర్మపురి నర్సింహస్వామి ఆలయంలో సర్వదర్శనానికి మూడు గంటలు పడుతోంది, కాళేశ్వరం ఆలయంలో స్వామివారి దర్శనానికి రెండు గంటలు పడుతోంది. మంథనిలో మాత్రం భక్తుల రద్దీ కాస్త తగ్గి సాధారణస్థాయికి వచ్చింది. మరోవైపు జిల్లాలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌ జిల్లాలోని పుష్కరఘాట్ల దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతోంది. పోచంపాడు, కందకుర్తి, తుంగిలి, తడపాకల్‌ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివస్తున్నారు. కందకుర్తి ఘాట్‌లో వాటర్‌ తక్కువగా ఉన్నా.. భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే జిల్లాలోని పుష్కరఘాట్‌లలో 15లక్షల 18వేల మంది పుస్కరస్నానాలు ఆచరించారు. మరోవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement