చెరువుల్లో 265 టీఎంసీల నీళ్లు

Development Of Ponds In Telangana Due To Mission Kakatiya - Sakshi

మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల అభివృద్ధి: హరీశ్‌రావు

తుంగతుర్తి: మిషన్‌ కాకతీయ పథకం కింద రాష్ట్రంలో 46 వేల చెరువులు అభివృద్ధి చెందాయని, వీటి ద్వారా 265 టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టామని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో సీనియర్‌ జర్నలిస్టు, రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన ‘పిట్టవాలిన చెట్టు’పుస్తకాన్ని ఆదివారం విద్యుత్‌ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి, దుబ్బాక ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, సోలిపేట రామలింగారెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికతో కలసి ఆవిష్కరించారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు పిట్టవాలిన చెట్టు పుస్తకం అద్దం పడుతుందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా జరిగిన అభివృద్ధి, గత, ప్రస్తుత పరిస్థితులను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారని కొనియాడారు. చెరువుల అభివృద్ధి పూర్తయిందని, ప్రస్తుతం చిట్టచివరి ఎకరాకు నీళ్లందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయం దండగంటే సీఎం కేసీఆర్‌ పండుగలా చేసి చూపించారని పేర్కొన్నారు.

కరువనేదే ఉండదు.. 
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇక కరువనేదే ఉండదని, ఆ పదానికి డిక్షనరీలో అర్థం వెతుక్కోవాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బతుకదెరువు కోసం వలసలు వెళ్లిన ప్రజలు నేడు తిరిగి సొంతూళ్లకు వచ్చారని తెలిపారు. కాగా, కేసీఆర్‌ సీఎం కాకపోతే మరో వెయ్యి జన్మలెత్తినా కాళేశ్వరం జలాలు వచ్చేవి కావని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ ఇంజనీర్‌ అవతారమెత్తి భగీరథుడిగా మారారని పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణపై కళ్లకు కట్టినట్లు పిట్టవాలిన చెట్టు పుస్తకంలో రాసిన రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు గోరెటి వెంకన్న, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మనోజ, జేసీ సంజీవరెడ్డి, వివిధ జిల్లాల జర్నలిస్టులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top