‘కాళేశ్వరం’తో రాష్ట్రం సస్యశ్యామలం

Deputy Speaker Padma Devender Reddy Prices On KCR - Sakshi

మహదేవపూర్‌(వరంగల్‌): ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చరిత్రలో నిలిచిపోతారని శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను శనివారం పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. ఉదయం 9 గంటలకు మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డకు చేరుకోవల్సిన పద్మాదేవేందర్‌రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఎల్‌ అండ్‌ టీ కంపెనీ అధికారులు, ఇంజనీర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు.  మేడిగడ్డ బ్యారేజీ డిప్యూటీ ఇంజనీయర్‌ సురేష్‌ బ్యారేజీ నిర్మాణ వివరాలను, నీటి ప్రవాహం, రివర్స్‌ పంపింగ్‌ సిస్టమ్‌ ద్వారా గోదావరి, ప్రాణహిత నీటిని తరలించే విధానంపై మ్యాపు ద్వారా వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి రంగంపై దృష్టి సారించలేదని, వలసాంద్రపాలకులు మన నీటిని దోచుకుపోతున్నా..తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రజానీకం ఉద్యమసారధి కేసీఆర్‌ వెంట నడిచి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి రంగ నిపుణులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో గోదావరి నీటి వినియోగంపై చర్చించి ‘వ్యాప్కోస్‌’ సంస్థతో సర్వే చేయించారని అన్నారు. గోదావరిలోని తెలంగాణ వాటా 957 టీఎంసీల నీటిని వాడుకునే విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని దాంట్లో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి 16 టీఎంసీల నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎగువ ప్రాంతాలకు తరలించాలని ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ను ప్రారంభించారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో 16 జిల్లాలకు సాగు, తాగునీటి వసతి కలుగుతోందని  తెలిపారు. కరువుతో అల్లాడుతున్న మెదక్‌ జిల్లాకు సింగూర్‌ జలాలు మాత్రమే ఉండేవని, గత ప్రభుత్వం సింగూరు జలాలను హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలకు తరలించడంతో పంట భూములన్నీ బీళ్లుగా మారాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.  తెలంగాణ రైతాంగం తరుఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆమె వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీపతి బాపు, నాయకులు సుంకె మధు, లక్ష్మణ్, బాబురావు, మాధవరావు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top