వారంలో వెయ్యికిపైగా  డెంగీ కేసులా? | Sakshi
Sakshi News home page

వారంలో వెయ్యికిపైగా  డెంగీ కేసులా?

Published Fri, Sep 13 2019 4:56 AM

Dengue Cases Increase in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన ఒక్క వారంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా 1,120 మంది డెంగీ బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వైద్య సదుపాయాలు ఉన్న హైదరాబాద్‌ మహానగరంలోనే పరిస్థితులు ఇలా ఉంటే, తెలంగాణలోని గ్రామాల్లో పరిస్థితులు ఇంకెలా ఉన్నాయో ఊహించవచ్చని వ్యాఖ్యానించింది. ఆస్పత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడం తీవ్రమైన విషయమని కూడా వ్యాఖ్యానించింది. కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్‌లో దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని అభిప్రాయపడింది.

పరిస్థితులు చేయిదాటిపోయే తీరులో ప్రమాద ఘంటికలు మోగకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పింది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా వైద్య సేవలు అందడం లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే సరిహద్దు రాష్ట్రాల నుంచి వైద్య సేవలు అందుకోవాలని సూచించింది. హైదరాబాద్‌ నగరంలో డెంగీ, ఇతర విషజ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ సమరి్పంచిన నివేదిక పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యల్ని సమగ్రంగా తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. డెంగీ జ్వరాల్ని అదుపుచేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ డాక్టర్‌ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, ఇదే అంశంపై న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను సుమోటో పిల్‌గా పరిగణించిన ధర్మాసనం వాటిని బుధవారం మరోసారి విచారించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement