వేములవాడలో నత్తనడకన వసతి గదుల నిర్మాణం

Delay In Accommodation Rooms Construction In Vemulawada - Sakshi

వసతి లభించక భక్తుల ఇబ్బందులు

రెండేళ్లు దాటినా పనుల్లో ప్రగతి కరువు

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణం

రాజన్న భక్తులకు ఎములాడలో వసతి గదులు లభించడం లేదు. పాతకాలపు వసతి గదులు మినహా ఇప్పటివరకు కొత్తగా వసతి గదుల సౌకర్యం కల్పించలేకపోతున్నారు. భీమేశ్వరాలయం చెంతనే రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గతేడాది మహాశివరాత్రికే అందుబాటులోకి తేవాల్సిన గదులు.. ఈఏడాది పండుగకు సైతం నిర్మాణం పూర్తిచేసుకోలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వస్తున్నాయి.

సాక్షి, వేములవాడ: రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో గల ఖాళీ  స్థలంలో వంద వసతి గదులు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు రెండేళ్లక్రితం రూ.11 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పనులు నత్తనడకన సాగడంతో నేటికీ గదుల నిర్మాణం పూర్తికాలేదు.

మహాశివరాత్రి వరకైనా అందేనా..? 
వచ్చే ఉడాది మహాశివరాత్రి జాతర వరకైనా కొత్త వసతి గదులు భక్తులకు అందుబాటులో వస్తాయా? రావా? అనే సందేహాలు నెలకొన్నాయి. వచ్చే మార్చి మొదటివారంలోనే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలోగా వసతి గదుల నిర్మాణం పూర్తికావడం సందేహాస్సదమేనని భక్తులు అంటున్నారు. అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వీడితే తప్ప పనుల్లో వేగం పెరగదని పేర్కొంటున్నారు.

గదులు లేవట 
కుటుంబసభ్యులతో కలిసి ఎములాడ రాజ న్న దర్శనం కోసం వచ్చినం. ఆలయ వస తి గదులు లేవట. ప్రైవేటు లాడ్జి తీసుకున్నం. పైసలు ఎక్కువైనయి. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో వసతి గదులు ఏకపోవడం శోచనీయం.– రాజేందర్, భక్తుడు, వరంగల్‌

ఎప్పుడైనా తిప్పలే..
దర్శనం కోసం పిల్లలతో కలిసి వచ్చినం. ఉండేతందుకు గదులు లేవు. అనేక ఏండ్ల నుంచి ఏటా ఇక్కడ గివే తిప్పలు. గిన్నేండ్ల నుంచి రూముల తిప్పలు తొలగించలేరా? భక్తులకు కనీసం వసతి గదులు ఇవ్వకుంటే ఎట్లా చెప్పుండ్రి. భక్తులకు రాగానే గదులు ఇవ్వాలి.– సులోచన, భక్తురాలు

పూర్తిచేస్తాం 
రాజన్న భ క్తులకు వసతి కల్పిం చేందుకు భీమేశ్వర ఆలయం సమీపంలోని ఖాళీస్థలంలో వంద గదులు నిర్మిస్తున్నాం. పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. మహాశివరాత్రి జాతర వరకు వీటిని అందుబాటులోకి తెస్తాం. – రాజేశ్, ఈఈ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top