భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగింపుపై రెవెన్యూ యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది.
గురువారంతో ముగిసిన గడువు
కొనసాగింపుపై ప్రభుత్వానికి లేఖ రాసిన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగింపుపై రెవెన్యూ యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి గురువారంతో గడువు ముగియడమే ఈ ఆందోళనకు కారణం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆశిం చిన మేరకు క్రమబద్ధీకరణ జరగకపోవడం, అభ్యంతరకరమైన భూముల విషయంలో ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా పాలుపోకవడం.. తదితర అంశాలపై ‘ఆశలన్నీ భూమి పాలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో రెవెన్యూ ఉన్నతాధికారులు మేల్కొన్నారు.
క్రమబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం గడువు ముగిసినందున ఈ ప్రక్రియను ఇకపైనా కొనసాగించడమా లేదా నిలిపివేయడమా.. అన్న సందిగ్ధత నెలకొందని, దీనిపై తగిన విధంగా స్పష్టతనిస్తూ తదుపరి ఆదేశాలివ్వాల్సిందిగా భూపరిపాలన విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ప్రస్తుతం సెలవులో ఉన్నందున ప్రిన్సిపల్ కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్య కార్యదర్శి సెలవు నుంచి వచ్చిన తర్వాత (సోమవారం) క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
10 నుంచే గ్రేటర్‌లో పట్టాల పంపిణీ!
త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మే 10 నుంచి ప్రారంభించాలని, మిగిలిన జిల్లాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2)న పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రెవెన్యూ ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలందినట్లు సమాచారం. శుక్రవారం అ న్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. పట్టాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా సూచనలు చేయడం దీనికి బలాన్ని చేకూరు స్తోంది.