మరణాలు లేకుండా చూడాలి | Deaths should be without | Sakshi
Sakshi News home page

మరణాలు లేకుండా చూడాలి

Sep 22 2014 3:27 AM | Updated on Sep 2 2017 1:44 PM

మరణాలు లేకుండా చూడాలి

మరణాలు లేకుండా చూడాలి

కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ వైద్య సేవలపట్ల నమ్మకంతో వస్తున్న పేదల మరణాలు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ ఆదేశించారు.

కరీంనగర్ హెల్త్ :
 ప్రభుత్వ వైద్య సేవలపట్ల నమ్మకంతో వస్తున్న పేదల మరణాలు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఆదివారం తనిఖీచేశారు. జిల్లాలో విషజ్వరాల బారిన పడి ప్లేట్‌లేట్ తగ్గిపోయి మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి వెళ్లడంతో ఆస్పత్రిని పరిశీలించారు. ముందుగా ఎమర్జెన్సీ వార్డులో అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు. రోజు ఆస్పత్రికి వస్తున్న వారి రికార్డులు పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్యం కోసం వస్తున్న వారికి సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని  చెప్పారు.  రోగుల బంధువులు ఫోన్‌చేస్తే సిబ్బంది తమకు తెలియదంటూ ఫోన్ మాట్లాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు పీఆర్వోలను నియమించి సెల్‌ఫోన్ సమకూర్చాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి పిల్లలవార్డును పరిశీలించారు. వార్డులో వైద్యం అందుకుంటున్న పిల్లలు ఎక్కువగా ఉండటంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలంతా విషజ్వరాలతో బాధపడుతున్నారని, ప్లేట్‌లేట్ కౌంట్ తగ్గి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వైద్యులు వివరించారు. ఆస్పత్రిలో రూ.35లక్షలతో ఏర్పాటుచేసిన ప్లేట్‌లేట్ మిషన్ అందుబాటులో ఉన్నా  ప్లేట్‌లేట్ అందించలేని పరిస్థితి ఉందని, ఆపరేట్ చేయడానికి టెక్నీషియన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే, సూపరింటెండెంట్ వివరించారు. స్పందించిన ఎంపీ ఆపరేటర్ నియమాకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూలకు పడిన ప్లేట్‌లేట్ మిషన్ ఓవరాలింగ్ చేయడానికి ఇంజినీర్‌ను పంపించాలని సంబంధిత శాఖ ఈడీకి ఫోన్‌చేసి చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి ప్లేట్‌లేట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఆస్పత్రిలోని వార్డులు మరమ్మతులు నిర్వహించి రంగులు వేయించాలన్నారు. మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్‌మెంట్ ఈడీ రాజేందర్‌కు ఫోన్‌చేసి నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ బకాయి బిల్లులు రూ.60 లక్షలు పెండింగ్‌లో ఉందని, పారిశుధ్య  పనులు నిర్వహణకు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని, ఆస్పత్రిలో 8మంది వైద్యలు అవసరం ఉందని, ముందుగా డీఎంహెచ్‌వో నుంచి నల్గురు వైద్యులను డెప్యుటేషన్ పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన రెండు నెలల వేతనాలు ఇవ్వాలని సిబ్బంది కోరగా.. వేతనాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి ప్రజాప్రతినిధుల ఆమోదంతో తయారుచేసిన ఫైల్‌ను పరిశీలించారు. కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్యను ఫోన్‌లో కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఆర్‌ఎంవో లక్ష్మిదేవి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నాయకులు కట్ల సతీశ్, వై.సునీల్‌రావు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement