హలో.. జర సునో!

Daily 700 Calls to GHMC Call Centre Hyderabad - Sakshi

జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు ఫోన్లు

లాక్‌డౌన్‌లో పెరిగిన సాధారణ గ్రీవెన్స్‌  

కోవిడ్‌–19 సందేహాలు, ఫుడ్, షెల్టర్‌ కోసం కూడా..

తక్షణమే స్పందిస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కాలం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు జనం వెళ్లడం లేదు.అత్యవసర సర్వీసులందించే విభాగాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడుతున్నవారెందరో.  ఈ నేపథ్యంలో ప్రజలు హెల్ప్‌లైన్, కాల్‌సెంటర్‌ నెంబర్ల ద్వారా తమ సమస్యలను సంబంధిత విభాగాల దృష్టికితీసుకువెళ్తున్నారు. సోషల్‌మీడియా ద్వారానూ ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సందర్భంగా షెల్టర్‌లేని వలసకూలీలు, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నవారూ జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌నెంబర్‌ను ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌ (040–21 11 11 11)కుసగటున 500 కాల్స్‌ అందేవి కాగా..లాక్‌డౌన్‌ సమయంలో ఈ సంఖ్య సగటున 700 కాల్స్‌కు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో ఆయా అంశాలపై సందేహాలు కూడా ఉన్నాయి.

ఆరా లెక్కువ..!
లాక్‌డౌన్‌ కాలంలో సాధారణ విచారణల్లో భాగంగా ప్రజలు జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు పనిచేస్తున్నాయా అంటూ ఎక్కువమంది ఆరా తీసినట్లు అధికారులు పేర్కొన్నారు.  
లాక్‌డౌన్‌కు సంబంధించి కరోనా నివారణకు సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేస్తున్నారని తెలిసి దాని కోసం అడిగిన వారున్నారు.  
ఇతర ప్రాంతాలకు చెందిన తమకు ఎలాంటి షెల్టర్, ఆహారం లేదంటూ ఎక్కువమంది
సంప్రదించారు.  
షెల్టర్‌లేని వారికి, వలస కార్మికులకు ఇబ్బందిలేకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలుండటంతో ఈ అంశానికి అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చారు.   
ఇక సాధారణ గ్రీవెన్స్‌లో ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి రోడ్ల మరమ్మతులు, గుంతలు తదితరమైనవి, స్ట్రీట్‌ లైట్స్‌ వెలగడం లేవని, కుక్కల బెడద ఉందని, దోమల వ్యాప్తిపైనా ఫిర్యాదులందాయి.
అధికారులు లాకౌట్, కోవిడ్‌ నివారణ చర్యలకు ప్రాధాన్యతనిస్తున్నారు. సాధారణ అంశాలను రొటీన్‌గా పరిష్కరిస్తున్నప్పటికీ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం లేదని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. వీటిలో  స్వచ్ఛ కార్యక్రమాల ఫిర్యాదులు కూడా ఎక్కువగా ఉండటం విశేషం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top