టీనేజ్‌ పిల్లలకు సైబర్‌ పాఠాలు

Cyber lessons to Teenagers - Sakshi

10 నుంచి 16 ఏళ్ల విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశం

సైబర్‌ నేరాలు, అశ్లీల నియంత్రణకు కేంద్ర హోంశాఖ నిర్ణయం

ఈ మేరకు చర్యలు చేపట్టిన తెలంగాణ పోలీస్‌

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ పిల్లల్లో, ప్రత్యేకంగా టీనేజీ పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. టెక్నాలజీ తప్పనిసరి అంటూ తల్లిదండ్రులు సైతం పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారు. దీంతో పిల్లలు పక్కదారి పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని సైబర్‌ క్రైమ్‌ విభాగం గుర్తించింది. స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న 10 నుంచి 16 ఏళ్ల పిల్లలు పోర్న్‌సైట్లు, సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని ఇటీవల చేసిన అధ్యయనంలో బయటపడింది. ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొంది. దీనితో అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ శాఖలు సైబర్‌ నేరాల నియంత్రణపై తప్పనిసరిగా టీనేజీ విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేంద్రం ఆదేశించింది. వాటి నియంత్రణకు ఎలా వ్యవహరించాలన్న అంశాలతోపాటు స్మార్ట్‌ఫోన్లలో విపరీతంగా అందుబాటులో ఉన్న యాప్స్‌ దుష్ప్రభావంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.

ఇందులో భాగంగా ‘స్మార్ట్‌ఫోన్లు–సైబర్‌ నేరాలు’అన్న అంశంపై ప్రత్యేకంగా ఒక పుస్తకం ప్రచురించడంతోపాటు 7, 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌శాఖ సైతం సీఐడీ ద్వారా పాఠ్యాంశం రూపకల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ 4 తరగతుల విద్యార్థులకు సైబర్‌నేరాలపై అవగాహన, నియంత్రణకు సంబంధించి ఒక పాఠ్యాంశం చేర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మార్కెట్‌లోకి వేలకొద్ది యాప్స్‌ రావడంతో టీనేజర్స్‌ ఏది పడితే అది వినియోగించకుండా ఉండేందుకు ‘గుడ్‌ టచ్‌–బ్యాడ్‌ టచ్‌’అనే పేరుతో ప్రత్యేకంగా చైతన్యం కలిగించనున్నారు.

ఆ యాప్‌ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా జరుగుతుందని ప్రాక్టికల్‌గా విశదీకరించేందుకు కృషి చేస్తున్నామని, దీనివల్ల టీనేజ్‌ యువత చెడుదారి పట్టకుండా ఉంటారని సీఐడీలోని ఓ పోలీస్‌ అధికారి అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చి పిల్లలను  చెడగొడుతున్న తల్లిదండ్రులకు సైతం పాఠశాలలు ఓరియెంటేషన్‌ ప్రోగ్రాం ద్వారా సైబర్‌ మోసాలపై అవగాహన కల్పిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top