పది మందిని కొల్లగొట్టారు! 

Cyber Crime Cases Increased In Hyderabad says Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కస్టమర్‌ కేర్, నెట్‌ బ్యాంకింగ్‌ హ్యాకింగ్, బోగస్‌ మెయిల్‌తో ఎర... బహుమతులు పంపుతున్నానంటూ టోకరా... ఇలా వివిధ పంథాలను అనుసరించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన పది మంది నుంచి రూ.19.91 లక్షలు కాజేశారు. వీరంతా గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గరానికి చెందిన పవన్‌ తల్లికి ఇటీవల ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. లండన్‌కు చెందిన ఓ క్రిస్టియన్‌ మిషనరీ సంస్థ నిర్వాహకుడిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. (రికార్డు: 24 గంటల్లో 20,903 కేసులు)

ఈమె యాక్సెప్ట్‌ చేయడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారారు. కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన క్రిస్టియన్స్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెసేజ్‌ పంపిన అతను వారి కోసం ఓ గిఫ్ట్‌ పంపుతున్నట్లు ఎర వేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారుల పేరుతో కాల్‌ వచ్చింది. దీంతో ఫోన్‌ను ఆమె పవన్‌కు ఇచ్చింది. లండన్‌ నుంచి 30 వేల పౌండ్లు, ఇతర బహుమతులతో కూడిన పార్శిల్‌ మీ పేరుతో వచ్చిదంటూ చెప్పిన వారు విదేశీ కరెన్సీ ఉండటంతో కేసు నమోదు చేస్తామని బెదిరించి పలు దఫాలుగా రకరకాల పన్నుల పేరుతో రూ.11.6 లక్షలు కాజేశారు. (‘కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నర ఏళ్లు పడుతుంది’ )

► ఆర్టిలరీ సెంటర్‌లో జవాన్‌గా పని చేసే అమోల్‌ యాదవ్‌ ఇటీవల గూగుల్‌ పేలో కొంత నగదు బదిలీ చేశాడు. ఆ మొత్తం చేరాల్సిన వారికి చేరకపోవడంతో గూగుల్‌ పే కాల్‌ సెంటర్‌ను సంప్రదించాలని భావించాడు. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన అతగాడు అందులో కనిపించిన నకిలీ కాల్‌ సెంటర్‌ నంబర్‌కు కాల్‌ చేశాడు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే చేసి రూ.54 వేలు పోగొట్టుకున్నాడు. 
► నగరవాసి పవన్‌ కుమార్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.27 లక్షలు అతడి ప్రమేయం లేకుండానే బదిలీ అయ్యాయి. నెట్‌ బ్యాకింగ్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
►బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి విద్యా రమణన్‌కు ఉత్తరాదిలో గోల్డీ అనే క్‌లైంట్‌ ఉన్నాడు. అతడి మాదిరిగా మెయిల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు కొంత డబ్బు అవసరమటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ఇది గోల్డీ నుంచి వచ్చిన మెయిల్‌గా భావించిన రమణన్‌ రెండు దఫాల్లో రూ.1.5 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. 
►వెస్ట్‌ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన గోపీ కృష్ణ ఫేస్‌బుక్‌లోని మార్కెట్‌ ప్లేస్‌లో ఓ బైక్‌ ఖరీదు చేయాలనే ఉద్దేశంతో అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించి రూ.75 వేలు మోసపోయాడు. 
►ఇదే తరహాలో సునీల్‌ అనే ఓ వ్యక్తి ఓఎల్‌ఎక్స్‌లో కనిపించిన సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ అమ్మకం ప్రకటనను చూశాడు. దాన్ని కొనాలనే ఉద్దేశంతో అందులో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. దీంతో ఈయన నుంచి సైబర్‌ నేరగాళ్లు అడ్వాన్సుల పేరుతో రూ.49 వేలు కాజేశారు.

►గోల్కొండ ఎక్స్‌ రోడ్స్‌లో నివసించే కుమార్‌ అనే వ్యక్తికి వాట్సాప్‌ ద్వారా ఓ సందేశం వచ్చింది. తన సోదరుడి డిస్‌ప్లే పిక్చర్‌ వినియోగించిన ఖాతా నుంచి ఈ సందేశం పంపిన సైబర్‌ నేరగాళ్లు నగదు అవసరం అంటూ కోరారు. కుమార్‌ ఆ నంబర్‌లో సంప్రదించడానికి ప్రయత్నించినా కలవలేదు. దీంతో మూడు దఫాల్లో రూ.2 లక్షలు చెల్లించాడు. మరికొంత కావాలంటూ వారు కోరడంతో అనుమానం వచ్చి సోదరుడిని సంప్రదించగా అది మోసమని తెలిసింది.  
►సైదాబాద్‌కు చెందిన రమావత్‌ శ్రీను ఓఎల్‌ఎక్స్‌ ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ ద్విచక్ర వాహనం ఖరీదు చేయాలని భావించారు. ఓ ప్రకటన చూసి స్పందించిన ఈయన వారితో సంప్రదించారు. చివరకు అడ్వాన్సుల పేరుతో రూ.56 వేలు చెల్లించి మోసపోయారు. 
►ఓల్డ్‌ మలక్‌పేట ప్రాంతానికి చెందిన వాసు డెబిట్‌ కార్డును కొందరు సైబర్‌ నేరగాళ్లు క్లోన్‌ చేశారు. దీని ద్వారా  బెంగళూరులోని ఓ ఏటీఎం నుంచి రూ.50 వేలు విత్‌డ్రా చేశారు. 
►బోయిన్‌పల్లికి చెందిన రాజశేఖర్‌కు కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ ఖాతా కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయాలని ఎర వేశారు. దాని కోసమంటూ ఖాతా వివరాలతో పాటు ఓటీపీలు సంగ్రహించి రూ.70 వేలు కాజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top