‘ఇంతకూ మనం ఎటువైపున్నాం.. ప్రభుత్వం వైపా లేక ప్రజల వైపున్నామా? ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాజకీయంగా కూడా గుర్తింపు లేకుండా పోయింది’ అని టీజేఏసీలో చర్చ మొదలైంది.
- ప్రజా పక్షమా.. ప్రభుత్వ పక్షమా?
- జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చ
హైదరాబాద్: ‘ఇంతకూ మనం ఎటువైపున్నాం.. ప్రభుత్వం వైపా లేక ప్రజల వైపున్నామా? ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాజకీయంగా కూడా గుర్తింపు లేకుండా పోయింది’ అని టీజేఏసీలో చర్చ మొదలైంది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన మంగళవారం జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ప్రభుత్వ విధానాలు, జేఏసీ తీరుపై చ ర్చించేందుకు కొందరు జిల్లా కన్వీనర్లు ప్రయత్నించగా వారించిన కోదండరాం మరో ఇరవై రోజుల్లో సమావేశమై పూర్తిస్థాయిలో సమీక్షించుకుందామని అన్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇన్నాళ్లూ కొంత స్తబ్ధుగా ఉన్న జేఏసీని మళ్లీ పట్టాలెక్కించడానికి జరగాల్సిన ప్రయత్నాలపైనా చర్చ జరిగింది. ప్రభుత్వ విధానాలపై ఊరికే వ్యాఖ్యలు చేయకుండా, సవివ ర నివేదికలు తయారు చేసి మాట్లాడుదామని స్టీరింగ్ కమిటీ సభ్యులకు కోదండరాం సూచించినట్లు సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకుండా, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా, విమర్శలు చేయకుండా ప్రభుత్వ కార్యదర్శికి నివేదికలు ఇవ్వాలని, పట్టించుకోకుంటే ఆ నివేదికలనే ప్రజల మధ్య పెట్టాలన్న చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో కాకుం డా నిర్మాణాత్మక సలహాలివ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీపై ఎలాంటి చర్చ జరగలేదంటున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చేదాకా వేచి చూడాలని అభిప్రాయపడినట్లు తెలిసింది.
పెండింగులో ఉన్న విభజనకు సంబంధించిన అంశాలపైనా, పూర్తిస్థాయి స్వయం పాలన సాధించుకోవడంపైనా చర్చ జరిగింది. కాగా తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ వేడుకలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందో, ఎవరికి బాధ్యతలు అప్పజెప్పిందో ఎలాంటి స్పష్టత లేదని కొందరు సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలకు కమిటీని వేస్తే టీజేఏసీ నేతలకు గుర్తింపు ఇవ్వాలని, ఉత్సవాల కమిటీకి చైర్మన్‌గా కోదండరాంకు బాధ్యతలు అప్పజెప్పాలని ఓ సభ్యుడు అన్నట్లు సమాచారం.