జీరోవడ్డీతో పంట రుణాలు

Crop Loans With Zero Interest - Sakshi

పీఏసీఎస్‌లో సభ్యత్వం   ఉన్న రైతులే అర్హులు

నావంద్గి పీఎసీఎస్‌ చైర్మన్, డీసీడీబీ డైరెక్టర్‌ అనంత్‌రెడ్డి వెల్లడి

బషీరాబాద్‌(తాండూరు): జిల్లా సహకార సంఘం నుంచి నావంద్గి సొసైటీకి రూ. కోటి పంట రుణాలు మంజూరు అయినట్లు పీఎసీఎస్‌ చైర్మన్, జిల్లా సహకార సంఘం డైరెక్టర్‌ అల్వీన్‌ అనంత్‌రెడ్డి తెలిపారు. సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతీ రైతుకు లక్ష రూపాయల వరకు రుణపరిమితితో జీరోవడ్డీపై పంట రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆయన బషీరాబాద్‌ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో డీసీసీబీ జీరోవడ్డీతో రుణాలు ఇస్తుందన్నారు. నావంద్గి సహకార సంఘంలో4,227 మంది రైతులు ఉన్నారని, వీరిలో గతేడాది 1500 మంది రైతులకు రూ.5కోట్ల స్వల్పకాలిక రుణాలు, 300 మందికి రూ.1.50కోట్లు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చినట్లు వివరించారు. గతంలో తీసుకున్న రుణాలను రెన్యువల్‌ చేసుకున్న రైతులకు వారం రోజుల్లో కొత్త రుణాలు ఇస్తామన్నారు.

ఇప్పటి వరకు క్రాప్‌లోన్‌ తీసుకోని రైతులు కొత్త పాసుపుస్తకం, పహాణి నఖల్‌తో వస్తే రుణాలు ఇస్తామని చెప్పారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పెంటారెడ్డి సహకారంతో బషీరాబాద్‌ మండలానికి అధిక రుణాలు రాబట్టినట్లు చెప్పారు.

 రైతుల కోసం డీసీసీబీ నుంచి ఎన్ని నిధులైనా తీసుకువస్తామని చైర్మన్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. రూ.కోటి పంట రుణాలు మంజూరు చేసిన డీసీసీబీ చైర్మన్‌కు అనంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ వెంకటయ్య పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top