అవినీతి, అవకాశవాద రాజకీయాలకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.
నేరేడుచర్ల : అవినీతి, అవకాశవాద రాజకీయాలకు చరమగీతం పాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్లలో జరుగుతున్న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో బుధవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూడడం హేయమైన చర్య అని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కాంట్రాక్టుల కోసం ఒక పార్టీలో ఎన్నికైన వారు ఇంకొక పార్టీలోకి మారడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరవల్లి వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, మిర్యాలగూడ పట్టణ కార్యదర్శి డబ్బికార్ మల్లేశ్, హుజూర్‌నగర్ డివిజన్ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, నేరేడుచర్ల మండల కార్యదర్శి కె.అనంత ప్రకాశ్, పట్టణ కార్యదర్శి కె.నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు వదిలి పార్టీ ఫిరాయింపులు
భువనగిరి : ప్రజాసమస్యలు పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయిస్తున్నామని చెబుతున్నదంతా బూటకమన్నారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా పాలన చేయాలనుకోవడం నీచమైన సంస్కృతి అన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, నారి అయిలయ్య, చంద్రారెడ్డి, నర్సింహులు, దాసరి పాండు, వేముల మహేందర్ తదితరులున్నారు.