ఆ బోగీలో 82 మంది

Covid 19: Over 82 Passengers Travelled In AP Sampark Kranti With Corona Patient - Sakshi

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎస్‌9 బోగీలో ప్రయాణించిన ఇండోనేసియన్లు..

మరికొంతమంది వచ్చినట్లు ప్రచారం.. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హైదరాబాద్‌: ఇండోనేసియా నుంచి కరీంనగర్‌ వచ్చిన 10 మంది బృందం ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు.

ఢిల్లీ నుంచి ప్రయాణించిన 12708 నంబర్‌ ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌ 9 బోగీలో వారు ప్రయాణించినట్లు రైల్వే శాఖ అధికారులు గుర్తించారు. టికెట్లు రిజర్వ్‌ చేసుకునే సమయంలో అందించిన ఫోన్‌ నంబర్లను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశారు. ఆ వివరాల ఆధారంగా ప్రయాణికులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత రైలు తిరుపతి వరకు వెళ్లింది. అంటే ఆ బోగీలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. 

వారి రాకతో కలకలం.. 
ఇండొనేషియా నుంచి 10 మంది విమానంలో తొలుత ఢిల్లీ వచ్చారు. అక్కడ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తితో కలసి ఈనెల 13న ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించారు. ఈనెల 14న రామగుండంలో దిగారు. అక్కడి నుంచి కరీంనగర్‌ వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రార్థనా మందిరంలో బసచేశారు. 15న ఉదయం పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలు ఇవ్వాలని పోలీసులు అడిగారు. దీంతో వైద్యపరీక్షల కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గైడ్‌తో పాటు ఇద్దరు స్థానికులతో కలసి కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. 

విదేశీయులు కావడంతో ఐసోలేషన్‌ వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. దీంతో వారిలో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని గాంధీకి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా తొలుత ఒకరికి పాజిటివ్‌ అని తేలగా, బుధవారం మరో ఏడుగురికి కూడా కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీరందరికీ గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరిని పర్యవేక్షించేందుకు పోలీస్‌ శాఖ స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌ను నియమించగా, అతడిలో కూడా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

అసలు ఎంతమంది వచ్చారు.. 
ఇండొనేసియా బృందం ఢిల్లీ నుంచి రైలు మార్గంలో రామగుండం, అక్కడి నుంచి కరీంనగర్‌ చేరుకున్నారు. వీరితో పాటు మరో 20 మంది కూడా భారత్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో మరో 10 మంది రామగుండం నుంచి జగిత్యాలకు వెళ్లినట్లు అనధికారిక సమాచారం. వీరు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కాగా, ఇంకో పది మంది ఎక్కడున్నారనే విషయంపై కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. 

ఎక్కడెక్కడ తిరిగారు..? 
కరీంనగర్‌కు వచ్చిన ఇండొనేషియాకు చెందిన 10 మంది ఎక్కడ బస చేశారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే అంశాలపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరా తీస్తోంది. కలెక్టరేట్‌ సమీపంలోని ఓ ప్రాంతంలో బసచేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతం చుట్టూ ఉన్న దుకాణాలను మూయించారు. వారు ఎవరెవరిని కలిశారనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. కరీంనగర్‌లోని పలు ప్రార్థనా మందిరాలతో పాటు రేకుర్తికి కూడా వెళ్లినట్లు సమాచారం. పలు చోట్ల కరచాలనంతో పాటు ఆలింగనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలను వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. ఇండొనేషియన్లు బస చేసిన ప్రాంతాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలందరికీ పరీక్షలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించడం గమనార్హం. 

చదవండి:
ఆ బ్లడ్‌ గ్రూపు వాళ్లు తస్మాత్‌ జాగ్రత్త!
ప్లీజ్‌ .. పెళ్లికి అనుమతించండి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top