మరొకరికి కరోనా

Covid 19: Fourth Case Confirmed In Telangana - Sakshi

స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన వ్యాపారికి పాజిటివ్‌

గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స

3: గాంధీ ఆస్పత్రిలో ‘పాజిటివ్‌’తో చికిత్స పొందుతున్న వారు

20: గాంధీ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితులు

22: విదేశాల నుంచి వచ్చిన వారిలో వికారాబాద్‌కు తరలించినవారు

వైద్యాధికారుల వెల్లడి

తల్లి అంత్యక్రియలకు షాంఘై నుంచి ఒకరి రాక

పాల్గొనేందుకు అనుమతి ఇవ్వని అధికారులు

శ్వాసకోశ వ్యాధులతో ప్రైవేట్‌కు వచ్చే వారి వివరాల సేకరణ

మహారాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తం..

తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురిపై కేసు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నాలుగో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన ఓ వ్యాపారికి (46) వైరస్‌ సోకినట్లు సోమవారం వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఆయన ఈ నెల 7న హైదరాబాద్‌ నుంచి స్కాట్లాండ్‌ వెళ్లారు. 13న స్కాట్లాండ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. 15న కోవిడ్‌ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన నలుగురిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో ఇటలీ నుంచి వచ్చిన యువతి (24), నెదర్లాండ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తి (48) చికిత్స పొందుతున్నారు. 

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు పాజిటివ్‌ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఇదే ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మరో 20 మంది కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వీరి కోవిడ్‌ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. కాగా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్‌తో పాటు అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వైద్య పరీక్షలు చేయించుకున్నారని, ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం లేదని ఆయన తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

22 మంది హరిత హోటల్‌కు..
హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 22 మందిని వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత హోటల్‌కు తరలించారు. వీరు చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. హరిత హోటల్‌లో వీరికి ప్రత్యేకంగా గదులు కేటాయించారు. అక్కడ మొత్తం 32 గదులున్నాయని, ఒక కుటుంబం మొత్తం ఒకే గదిలో ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వచ్చిన దాదాపు 107 మందిని గుర్తించే పనిలో అధికారులున్నారు.

తల్లి చనిపోయినా చూడన్విలేదు
చైనాలోని షాంఘై నుంచి ఓ వ్యక్తి.. తన తల్లి చనిపోతే ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. అయితే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతివ్వలేదు. అతడిని పూర్తిగా తమ పరిధిలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడకు వచ్చి కూడా తన తల్లి చివరి చూపులు కూడా చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. అతడు వచ్చిన విమానంలోని ఇతర ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు.

శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల వివరాలు చెప్పాలి
కోవిడ్‌ ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లిందన్న దానిపై అధికారుల్లో అయోమయం నెలకొంది. కొందరు విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లిపోతున్నారు. వారి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. కోవిడ్‌ శ్వాసకోశ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కాబట్టి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య ఆరోగ్య శాఖ కొన్ని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. క్లినికల్‌ సర్వైలెన్స్‌ చేయడం తప్పనిసరి చేసింది. ఆస్పత్రులకు ఎంతమంది న్యుమోనియాతో వస్తున్నారు? వారిలో చనిపోయిన వారెందరు తదితర వివరాలు వివరాలు పంపాలని ఆస్పత్రులకు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లకు పైబడిన వారి వివరాలు ఇవ్వాలని సూచించింది. 

అలాంటివి వస్తే తక్షణమే ఐడీఎస్‌పీ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ సీమ తబుసం ఫోన్‌ నంబర్‌: 9059746612కు వివరాలతో వాట్సాప్‌ చేయాలని ఆదేశించారు. కాగా, జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారటం వంటి కోవిడ్‌ అనుమానిత కేసులు వస్తే అనేక ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. కర్నాటకకు చెందిన ఓ బాధితుడు రెండు, మూడు ప్రైవేటు ఆస్పత్రులకు తిరగడం, ఆ తర్వాత చనిపోవడంతో ఒక్కసారిగా ఆయా ఆస్పత్రుల్లో ఆందోళన పెరిగింది. ఇలాంటి కేసులు తీసుకుంటే సాధారణ రోగులు రావడానికి భయపడతారనేది వాటి భావన. మొదట్లో కోవిడ్‌ నియంత్రణకు ముందుకొస్తామని చెప్పినా.. ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి.

మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్‌..
మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే రూట్లలో, చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ధర్మబాద్, బోరజ్, జహీరాబాద్, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ శివారుల్లోని చెక్‌ పోస్ట్‌ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్కారు తెలిపింది. అవసరమైన చోట థర్మల్‌ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సాధారణంగా మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి అనేకమంది వస్తూపోతుంటారు. బస్సులు, రైళ్లల్లో వచ్చి వెళ్తుంటారు. దీంతో వైరస్‌ మనకు విస్తరించే ప్రమాదం ఉందన్న భావన నెలకొంది. కాగా, వైరస్‌ వ్యాప్తిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భావనతో, కొందరు ఫేక్‌ పేర్లతో పలానా వ్యక్తికి కోవిడ్‌ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారని ప్రజారోగ్య విభాగం తెలిపింది.

గచ్చిబౌలి స్టేడియంలో 400 గదులు..
గచ్చిబౌలి స్టేడియానికి అనుబంధంగా ఉన్న టవర్లలో 400 గదులు అందుబాటులో ఉన్నాయి. వాటిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తారు. అవసరమైతే వాటిని శాశ్వతంగా వైరస్‌ నియంత్రణ ఆస్పత్రిగా మార్చాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. ఫారెస్ట్‌ అకాడమీ సహా మరో నాలుగైదు ప్రభుత్వ సంస్థలకు చెందిన భవనాలను కూడా సిద్ధం చేస్తున్నారు. విమానాశ్రయానికి వచ్చే ఏడు దేశాలకు చెందిన వారెవరినైనా సరే సర్కారు ఆధ్వర్యంలోనే ఐసోలేషన్‌ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు.

కరీంనగర్‌లో కోవిడ్‌ టెన్షన్‌
కరీంనగర్‌ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సోమవారం కోవిడ్‌ వదంతులతో హైటెన్షన్‌ నెలకొంది. ఇండొనేషియా నుంచి వచ్చిన 10 మంది వైద్య పరీక్షల కోసం రావడం, అందులో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోవిడ్‌ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇండొనేసియాకు చెందిన 10 మంది మత బోధకుల బృందం ఈ నెల 9న భారత్‌కు వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి రైలులో రామగుండం చేరుకొని, 14 సాయంత్రం కరీంనగర్‌కు వచ్చి ఓ ప్రార్థనా మందిరంలో బస చేశారు. 15న ఉదయం పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకొని మెడికల్‌ రిపోర్టులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రికి ఉదయం 10 గంటలకు చేరుకోగా, పరీక్షలు నిర్వహించారు.

కోవిడ్‌ బాధితులకు ఈటల ఫోన్‌
కోవిడ్‌ వైరస్‌ బారిన పడి గాంధీలో చికిత్స పొందుతున్న ముగ్గురితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వార్డులో ఉన్న సౌకర్యాలు, ఆహారం తదితరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ బారిన పడిన యువకుడు కోలుకున్నాడని గుర్తు చేస్తూ ఈ ముగ్గురికి ధైర్యం చెప్పారు. వాళ్లు అడిగిన సౌకర్యాలు సమకూర్చాలని గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌కు మంత్రి సూచించారు. ఈ మేరకు మంత్రి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటోందని, ఎవరూ భయపడాల్సిన పని లేదని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.

చదవండి:
అక్కడ తొలి ‘కరోనా’ మరణం
కరోనాపై రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ వీడియో
టచ్‌ చేస్తే వైరస్‌ పారిపోతుంది!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top