
అక్రమార్కుల్లో దడ
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
‘హౌసింగ్’లో తవ్వినకొద్దీ అవినీతి
- పిల్లల పేరిట సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు!
- నాలుగు గ్రామాల్లోనే రూ. కోటికిపైగా స్వాహా
- జిల్లాలో రూ. 70 కోట్లు దారిమళ్లినట్టు అంచనా
- సీఐడీ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.70 కోట్లకుపైగా అవినీతి జరిగి ఉంటుందని అంచనా. దీనిని నిర్ధారించుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతిపై ఇటీవల సీఐడీ విచారణ ప్రారంభించింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శేరిదామరగిద్ద, పంచగామ, అందోలు నియోజకవర్గంలోని కేరూర్, నాగులపల్లిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ లబ్ధిదారులు, హౌసింగ్ అధికారులతో మాట్లాడటంతోపాటు ఇళ్లు నిర్మించిందీ, లేనిదీ స్వయంగా పరిశీలించారు. నాలుగు గ్రామాల్లోనే సుమారు కోటి రూపాయల అవినీతి చోటు చేసుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆయా గ్రామాల్లోని రాజకీయనాయకులు, హౌసింగ్ అధికారులు, దళారులకు అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. జిల్లా సీఐడీ అధికారులు, హౌసింగ్ శాఖకు చెందిన ఈఈ, డీఈలతోపాటు పదిమంది ఏఈలను విచారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గత పదేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపైనా సీఐడీ విచారణకు సిద్దమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక బృందాలు త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు
‘హౌసింగ్’లో అక్రమార్కుల మెడ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇళ్ల మంజూరులో ఈఈ, డీఈల పాత్ర ఉండగా పనుల పర్యవేక్షణ, బిల్లుల మంజూరులో ఏఈ, వర్క్‌ఇన్‌స్పెకర్ కీలకపాత్ర ఉంటుంది. వ ర్క్‌ఇన్‌స్పెక్టర్ మొదలు ఈఈ స్థాయి అధికారుల వరకు అవినీతిలో ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.