ఆర్టీసీలో అవినీతి ని‘రంజన్లు’!

Corruption in the RTC - Sakshi

     రంజన్లు కొన్నామని, మట్టి పోయించామని దొంగ బిల్లులు 

     విజిలెన్స్‌ విచారణలో దొరికిన అధికారులు 

     నివేదిక అందినా చర్యలు తీసుకోని వైనం.. 

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఏర్పాటు చేసే మంచి నీటి కుండలనూ వదల్లేదు అవినీతి అధికారులు. ఆర్టీసీ సిబ్బందికి ఎండల్లో చల్లటి నీ రు అందించేందుకు రంజన్‌ (భారీ నీటి కూజా)లు కొన్నామంటూ దొంగ బిల్లులు సృష్టించి నిధులు కాజేశారు. ఇక ఆర్టీసీ శిక్షణ కేంద్రాలు, బస్‌ డిపోలు, బస్టాండ్ల వద్ద మట్టి పోయించామంటూ మరికొందరు అధికారులు బిల్లులతో డబ్బులు స్వాహా చేశారు. కండక్టర్లు పది రూపాయల లెక్క సరిగా చూపకుంటే విధుల్లోంచి తొలగించిన దాఖలాలు ఆర్టీసీలో సాధారణం. కానీ దొంగ బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజానాకు కన్నం పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా, పైపెచ్చు వారికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైన వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారుతోంది. 

ఇంటి దొంగలను పట్టించిన విజిలెన్స్‌ 
ఇటీవల ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగం కొందరు ఇంటి దొంగల గుట్టు విప్పింది. తప్పుడు బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజా నాకు కన్నంపెట్టిన వారి వివరాలు సేకరించింది. అలా ఎంత మొత్తం వారి పరమైందో లెక్కలతో సహా బస్‌భవన్‌కు నివేదిక సమర్పించింది. కానీ అందులో పేర్లు నమోదైన అధికారులపై చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారు. పలు జిల్లాల్లో ఈ తంతు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో కొందరి పేర్లు డిపో మేనేజర్ల పదోన్నతుల జాబితాలో ఉం డటంతో వారి గురించి బయటకు పొక్కకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్‌కు చెందిన ఓ అధికారి రంజన్లు కొన్నట్టు, అక్కడి ఆర్టీసీ శిక్షణ కళాశాల ప్రాంగణంలో మట్టి పోయించినట్టు బిల్లులు సృష్టించి డబ్బులు తీసుకున్నారు. దీనిపై విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లటంతో విచారణ జరిపిన అధికారులు అవి తప్పుడు బిల్లులని, వాటిలో చూపినట్టుగా రంజన్లు కొనలేదని, మట్టి పోయించలేదని తేల్చారు. 

రికవరీ మొత్తాన్ని వదల్లేదు.. 
చిన్నచిన్న ప్రమాదాల్లో బస్సులు డ్యామేజ్‌ అయితే విచారణ జరిపి డ్రైవర్ల తప్పిదం ఉంటే వారి నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేయటం సహజం. అలా డ్రైవర్ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టకుండా ఓ అధికారి స్వాహా చేశారు. కానీ ఆ అధికారిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు అడ్డుపడ్డారు. 

విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు 
అసలే ఆర్టీసీ విజిలెన్సు దాదాపు నిర్వీర్యమైంది. పర్యవేక్షించే వారు లేక కేవలం కమీషన్లు దండుకోవటం మినహా చేసేదేమీ లేదంటూ ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లాల్లోని కొందరు అధికారులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసి నివేదికలు సమర్పిస్తే ఉన్నతాధికారులు వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. విజిలెన్సు కేసుల్లో దొరికిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తే ఇక వారు డిపోలను దివాళా తీయిస్తారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.  

అస్మదీయులకు అందలం 
కండక్టర్ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు.. సొంత ఖజానాకు కన్నం పెట్టే అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్లు, మట్టి పేర దొంగ బిల్లులతో డబ్బులు కాజేసిన వారు, అద్దె బస్సుల నిర్వాహకులతో కుమ్మక్కయిన అధికారులపై చర్యలు తీసుకోక పోగా.. అందులో కొందరికి డిపో మేనేజర్లుగా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో హైదరాబాద్‌ బస్టాండ్లలోని దుకాణాల అద్దెలు వసూలు చేసి ఖజానాకు చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వారి విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. రూ.కోట్లలో నిధులు స్వాహా చేసిన కేసులో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న విశ్రాంత ఉద్యోగులపై చర్యలు తీసుకుని, బాధ్యులైన అసలు అధికారులు వదిలిపెట్టారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top