కరీంనగర్ జిల్లా వేములవాడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం విచారణ నిర్వహించారు.
వేములవాడ అర్బన్ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జరిగిన అవినీతి వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం విచారణ నిర్వహించారు. అక్కడ పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి కె.శ్రీనివాస్ ముగ్గురు రిటైర్డ్ టీచర్ల పేరిట ఐడీలు సృష్టించి వారి పేరు మీద రూ.17.88 లక్షలను డ్రా చేసుకున్న వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. 2015 ఏప్రిల్ నుంచి 2016 జనవరి వరకు ఈ వ్యవహారం నడిచింది. దీంతో డీఈవో శ్రీనివాసాచారి మంగళవారం వేములవాడలోని ఎంఈవో కార్యాలయానికి వచ్చి విచారణ నిర్వహించారు.
రికార్డులను సీజ్ చేశారు. అలాగే, ఈ నిధులను ఎస్‌బీహెచ్ శాఖలోని రెండు ఖాతాల పేరిట డ్రా చేసుకున్నట్టు గుర్తించడంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి వాటిని ఫ్రీజ్ చేయించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఈవో శ్రీనివాసచారి తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎంఈవో శోభన్‌రావు, అవినీతికి సూత్రధారి అయిన కె.శ్రీనివాస్, డబ్బులు డ్రా చేసుకోవడానికి సహకరించిన అరుణ్‌కుమార్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.