ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా టెస్ట్‌లకు  విరామం

Corona Virus Tests Stopped In Private Labs - Sakshi

ఈ నెల 5 వరకు నిలిపివేయాలని యాజమాన్యాల నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. గురువారం నుంచి ఈ నెల 5 వరకు పరీక్షలు చేయకూడదని ప్రైవేటు ల్యాబ్‌ల యాజమాన్యాలు నిర్ణయించాయి. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్రంలో 18 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చాయి. దీంతో గతనెల మూడో వారం నుంచి ప్రైవేటు ల్యాబ్‌లు ఈ పరీక్షల్ని ముమ్మరంగా చేపట్టాయి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే అధిక మొత్తంలో శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించింది.

ఈ క్రమంలో ప్రైవేట్‌ ల్యాబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తేలింది. అవగాహన, నైపుణ్యం లేని వారితో పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందువల్లే తప్పుడు ఫలితాలు వస్తున్నట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయా ల్యాబ్‌ల యాజమాన్యాలకు నోటీసులు జారీచేస్తూ, లోపాలు దిద్దుకోవాలని ఆదేశించింది.

లోపాలు సరిదిద్దుకునేందుకే..
ప్రభుత్వ నోటీసులకు వివరణ ఎలా ఇవ్వాలనే దానిపై ప్రైవేట్‌ ల్యాబ్‌లు తర్జనభర్జన పడుతున్నాయి. లోపాలు దిద్దుకుని ఈ నెల 5 వరకు నివేదిక ఇవ్వాలని భావిస్తున్నాయి. ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల పాటు కొత్తగా పరీక్షలు చేయరాదని నిర్ణయించాయి. అయితే ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే శాంపిల్స్‌ను మాత్రం పరిశీలిస్తున్నట్లు ల్యాబ్‌ యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే, ఇప్పటివరకు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేసిన పరీక్షల ఫలితాలను ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు.

ఓ ప్రైవేటు ల్యాబ్‌ ఏకంగా 12వేల పరీక్షలు నిర్వహించినా.. ఫలితాలను అప్‌లోడ్‌ చేయకపోవడం గమనార్హం. కాగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయొద్దని తామెలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టంచేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top