
3 రోజులుగా కన్నతల్లికి దహన సంస్కారం చేయని కూతుళ్లు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట): భర్త చనిపోయినా తన ఇద్దరు ఆడ పిల్లలను కష్టపడి పెంచి ఆస్తులు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే... చివరికి మిగిలి ఉన్న బంగారం పంచుకోవడం కోసం గొడవపడి 3 రోజులుగా కన్నతల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేయలేదు ఆ కూతుళ్లు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆత్మకూరు.ఎస్ గ్రామానికి చెందిన పొదిల నరసమ్మ (80)కు ఇద్దరు కూతుళ్లు.
పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోగా కష్టపడి ఆడపిల్లలను పెంచి పెద్ద వాళ్లని చేసింది. ఇటీవల అనారోగ్యంతో ఉన్న నరసమ్మ తన చిన్న కూతురు కళమ్మ ఇంటికి తనవద్ద ఉన్న ఆరు తులాల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను వెంట తీసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం నరసమ్మ అనారోగ్యంతో మృతిచెందింది.
దీంతో అంత్యక్రియలు చేసేందుకు మృతదేహాన్ని ఆత్మకూర్‌కు తీసుకొచ్చారు. అయితే నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి వస్తువుల గురించి ఇద్దరు కూతుళ్లు వివాదానికి దిగారు. అంత్యక్రియలు చేయకుండానే చిన్న కూతురు కళమ్మ వెళ్లిపోయింది. నరసమ్మ వద్ద ఉన్న నగదు, బంగారం, వెండి తెచ్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని పెద్ద కూతురు వెంకటమ్మ పట్టుపట్టింది. బంధువులు నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోవడంతో గురువారం స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వెంకటమ్మ కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు.