సహకార సమరానికి బ్రేక్‌ 

Cooperation Election Notification Pending - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు ముచ్చటగా మూడో సారి వాయిదా పడ్డాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సమరానికి బ్రేక్‌ పడింది. ఇందుకు అనుగుణంగా కమిషనర్‌ నుంచి ఉన్నతాధికాలకు ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సహకార వ్యవస్థను ప్రారంభించారు.  రైతులు సంఘాలుగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. అయితే సంఘాలు మరింత పటిష్టంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో పలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా ఫొటో ఓటరు జాబితాను ప్రవేశపెట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 28న సహకార సంఘాల ఓటరు జాబితాను ప్రకటించారు.

32 సంఘాలు.. 
జిల్లాలో 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పరకాల నియోజకవర్గంలో 13, నర్సంపేట నియోజకవర్గంలో 13, వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో 3, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో 2, భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఒక సంఘం ఉంది. కాగా కొన్ని సహకార సంఘాల పాలకవర్గం గడువు 2018 జనవరి 30, మరి కొన్ని ఫిబ్రవరి 4వ తేదీ ముగిసింది. అయితే ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు  అవసరమైన సమయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గడువు ముగిసిన పాలక వర్గాలకే పర్సన్‌ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. తొలుత ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి.  కాగా సంగెం పాలక వర్గం మాత్రం 2020 ఆగస్టు వరకు కొనసాగనుంది.
  
పార్లమెంట్‌ తర్వాతేనా.. 
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కంటే ముందే సహకార ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు చేసింది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనివార్యమైంది. జీపీ ఎన్నికలు ముగిసిన తర్వాతనైన సహకార ఎన్నికలు జరుగుతాయని సంఘాల సభ్యులు, ఓటర్లు భావించగా మరోసారి వాయిదా పడింది.  ఫిబ్రవరిలో  నిర్వహించకుంటే మార్చిలో పార్లమెంట్‌  ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం  ఉంటుంది. ఆ తర్వాత వెనువెంటనే మునిసిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ లేదా  మునిసిపల్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. గత డిసెంబర్‌ 28న సహకార సంఘాల సభ్యుల ఓటరు లిస్టులను ప్రకటించారు. దాదాపు ఎన్నికలకు కావల్సిన అన్ని ఏర్పాట్లను సహకార శాఖ ఏర్పాట్లను చేసింది. కొత్త జిల్లాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
 
వాయిదా పడ్డాయి.. 
హకార సంఘాల ఎన్నికలు  వాయి దా పడ్డాయి. గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనే సహకార సంఘాల పాలకవర్గం గడువు ముగిసింది. డిసెంబర్‌ 28న ఓటరు జాబితను ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం. 31 సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – పద్మ, జిల్లా సహకార అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top