
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవుల్లో నిప్పు రాజేయడం, వంటలు చేయడంపై అటవీ శాఖ నిషేధం ప్రకటించింది. రక్షిత అటవీ ప్రాంతాల్లో బయటి వ్యక్తులు, ఇతరుల ప్రవేశంపైనా ఆంక్షలు విధించింది. వేసవిలో అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలుండటంతో.. ఈ చర్యలు చేపట్టింది. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో మూడు అగ్నిప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు నల్లమల అడవి మీదుగా శ్రీశైలానికి వెళ్లనున్న క్రమంలో.. వారు అటవీ శాఖ సూచనలు తప్పక పాటించాలని, నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలని, కాలిబాట ప్రయాణాలు చేయరాదని ప్రకటించింది.
అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విరామ ప్రాంతాల్లోనే సేదతీరేందుకు అనుమతి ఉందని అటవీ శాఖ స్పష్టం చేసింది. కూర్చునే సదుపాయం, తాగునీటి సౌకర్యం, చెత్త వేసేందుకు కుండీలు ఏర్పాటు చేస్తోంది. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాల్లో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. పశువుల కాపరులు, అడవిలోకి వచ్చేవారు సిగరెట్, బీడీ తాగకుండా చర్యలు చేపడుతోంది.
అవగాహనా కార్యక్రమాలు
అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం 9,771 కంపార్ట్‌మెంట్లకు గాను 43 అటవీ రేంజ్‌ల్లో 1,106 ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు అత్యంత ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించారు. కనీసం ఐదుగురు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్‌లతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లుంటాయి. శాటిలైట్‌లో పర్యవేక్షించే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్నందున, ఎక్కడ ప్రమాదం జరిగినా సంబంధిత అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు.