ఉండేనా..? ఊడేనా..? | Contract faculty Worry About Posts Notification | Sakshi
Sakshi News home page

ఉండేనా..? ఊడేనా..?

Apr 23 2018 12:45 PM | Updated on Apr 23 2018 12:45 PM

Contract faculty Worry About Posts Notification - Sakshi

ఇన్నాళ్లూ వారు చాలీచాలని వేతనాలతోనే పనిచేశారు. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎన్నాళ్లకైనా ప్రభుత్వం స్పందించకపోతుందా..? తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాకపోతాయా..? అని ఎదురుచూశారు. రెగ్యులర్‌ సంగతి దేవుడెరుగు.. అసలు వారి ఉద్యోగాలకే ఎసరు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది శాతవాహన యూనివర్సిటీతోపాటు.. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు జేఎన్టీ యూ, పెద్దపల్లి జిల్లా మంథనిలోని జేఎన్టీయూ వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు శరాఘాతంలా మారింది.  – శాతవాహనయూనివర్సిటీ

శాతవాహనయూనివర్సిటీ: ప్రభుత్వం జీతం పెంచిందని సంబరపడాలా..? త్వరలో నోటిఫికేషన్‌ వస్తే ఉద్యోగాలకే ఎసరు వస్తుందా..? అని బాధపడాలా తెలియని సందిగ్ధంలో శాతవాహన, కొండగట్టు, మం థని జేఎన్‌టీయూ యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు మగ్గిపోతున్నారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 యూనివర్సిటీల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకుకు వేతనాలు 75 శాతం పెంచుతూ ఈనెల 18న విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు తాత్కాలిక (పార్ట్‌టైం) అధ్యాపకులకూ వేతనాలు పెంచారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో 1,061 పోస్టులు భర్తీచేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ పక్రియకు ఇన్నిరోజులు రిజర్వేషన్‌ ఎలా ఉండాలో అనే దానిపై కసరత్తు చేసి.. చివరకు పాత పద్ధతిలోనే యూనివర్సిటీల వారీగా రోస్టర్‌/రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం వర్సిటీలకు స్పష్టం చేసింది. దీంతో అన్ని వర్సిటీలతోపాటు శాతవాహనలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సంబంధిత నోటిఫికేషన్‌ కూడా త్వరలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్‌ వస్తే ఇందులో ఎంతమంది ఉ ద్యోగాలు ఉంటాయో..? ఎన్ని ఊడుతాయో..? తెలియని అ యోమయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం జీతాలు పెంచిందని సంబరపడేలోపే నోటిఫికేషన్‌ రూపంలో తమ ఉద్యోగాలకే ఎసరురాబోతోందని పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు కలవరపడుతున్నారు. యూనివర్సిటీలు నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ పక్రియ జరిగిన తర్వాత ప్రస్తుతం ఉన్న కాంట్రా క్టు, పార్ట్‌టైం అధ్యాపకుల్లో కొంతమందైనా తమ ఉద్యోగాలకు దూరంకావాల్సిందేనని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

75 శాతం పెరిగిన వేతనాలు
యూనివర్సిటీలో కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకుల వేతనాలు 75 శాతం పెరిగాయి. దీని ప్రకారం నెట్, స్లెట్, పీహెచ్‌డీ లేని వారికి ప్రస్తుతం రూ.21,600 చెల్లిస్తుండగా తాజాగా రూ.37,800 పెరుగనుంది. ఆయా విద్యార్హతలున్న అధ్యాపకులకు ఇప్పుడు రూ.24,840 ఇస్తుండగా అది రూ.43,470కు చేరుకుంది. దీనికి తోడు ఏడాది సర్వీస్‌కు 3 శాతం చొప్పున అదనంగా చెల్లింపులు చేస్తారు. తాత్కాలిక అధ్యాపకులకు ప్రస్తుతం బోధనకు గంటకు రూ.475, ప్రయోగ పరీక్షలకు రూ.220 చెల్లిస్తున్నారు. ఇక నుండి పీహెచ్‌డీ/నెట్‌/స్లెట్‌ లేనివారికి గంట బోధనకు రూ. 600, ప్రయోగాలకు రూ.300 చెల్లిసారు. ఈ అర్హతలున్నవారికి బోధనకు రూ.700, ప్రయోగాలకు రూ.350 చెల్లిస్తారు. ప్రభుత్వం తీసుకున్న జీతాల పెంపు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 1553 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 560 తాత్కాలిక అధ్యాపకులు లబ్ధిపొందనున్నారు. శాతవాహనలో 45 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 16 మంది పార్ట్‌టైం అధ్యాపకులు లబ్ధి పొందనున్నారు.

శాతవాహనలో 40 పోస్టుల భర్తీ
శాతవాహనలోని వివిధ విభాగాల్లో 40 పోస్టులు భర్తీకానున్నాయి. ఇందులో 9 మంది ప్రొఫెసర్, 16అసోసియేట్‌ ప్రొఫెసర్, 15 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో డిపార్ట్‌మెంట్ల వారీగా ఫార్మసీలో 3 ప్రొఫెసర్, 4 అసోసియేట్‌ ప్రొఫెసర్, 11 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, కెమిస్ట్రీలో 2 అసోసియేట్‌ ప్రొఫెసర్, ఫిజిక్స్‌లో ఒక ప్రొఫెసర్, 3 అసో సియేట్‌ ప్రొఫెసర్, ఉర్దూలో ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్‌ ప్రొఫెసర్, సోషియాలజీలో ఒక ప్రొఫెసర్, 2 అసోసియేట్‌ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎకనామిక్స్‌లో 1 ప్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, కామర్స్‌లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ శాతవాహన నుంచి త్వరలోనే రానుందని యూనివర్సిటీ అ«ధికారుల ద్వారా తెలిసింది. యూనివర్సిటీ చేపట్టనున్న భర్తీలో ఎంతమంది రెగ్యులర్‌ ఉద్యోగాలు సాధిస్తారో..? మరెంత మంది తమ కాంట్రాక్టు ఉద్యోగాలు కోల్పోతారో చూడాల్సిందే.

క్రమబద్ధీకరించేలా చూడాలి
ప్రభుత్వం జీతాలు పెంచడం హర్షణీయం. ఏళ్ల తరబడి ఉ ద్యమాలు చేస్తే జీతాలు పెంచారు. తక్కువ జీతంతో ఇన్నా ళ్లు ఇబ్బందులు పడుతూ నెట్టుకొచ్చాం. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్‌ వస్తే మా పరిస్థితి ఏంటీ..? ఇందులో ఎంతమంది రెగ్యులర్‌ నోటిఫికేషన్‌లో లబ్ధిపొందుతారో..? ఎంతమందికి నష్టం జరుగుతుందో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులకు సర్వీస్‌ రాటిఫికేషన్‌ ఇచ్చి.. క్రమబ ద్ధీకరణ చేసేలా ముందుకెళ్లాలి. పెంచిన జీతాలను గతేడాది నవంబర్‌ నుంచి అమలుచేయాలి.  – పెంచాల శ్రీనివాస్, శాతవాహన కాంట్రాక్టు అధ్యాపక సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement