
కాంగ్రెస్‌లోనే... కొనసాగుతా
‘తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన సోనియాగాంధీకి రుణ పడి ఉంటాం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల నాయకత్వంలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ‘తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన సోనియాగాంధీకి రుణ పడి ఉంటాం. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల నాయకత్వంలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. నేను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదు. టీఆర్‌ఎస్‌లోకో, మరో పార్టీలోకో మారే ఆలోచనే లేదు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాను. కార్యకర్తలు ఎలాంటి గందరగోళానికి గురికావొద్దు..’అని భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివరించారు.
ఆయన పార్టీ మారుతున్నారంటూ ఇటీవల జరిగిన ప్రచారం, మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలోనే ఈ వివరణ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పత్రికా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తామని, హామీలు అమలు కాకుంటే నిలదీసేదీ కూడా తామేనని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల్లో అయోమయం సృష్టించడానికే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ర్పచారాన్ని ఆపేందుకు ఈ వివరణ ఇస్తున్నట్లు చెప్పారు.