తండా రోడ్లకు మహర్దశ.. 

Construction of bt roads with Rs. 450 crores - Sakshi

     రూ. 450 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం 

     ప్రధాన రహదారులతో 721 ఆవాసాల అనుసంధానం 

     566 పనులకు టెండర్లు పూర్తి.. నెలాఖర్లో పనులు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: గతుకుల ప్రయాణం ఇక గతించనుంది. కాలిబాటలు కనుమరుగు కానున్నాయి. తండాతండాకు బీటీ రోడ్డు దర్శనమివ్వనుంది. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో 12,905 గిరిజన తండాలుండగా వీటిలో 4,673 తండాలకు తారురోడ్డు సౌకర్యం లేదు. ఇందులో సగం తండాలకు మెటల్‌ రోడ్లు ఉన్నా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలిబాటలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో 2017–18 వార్షిక సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ తండాలకు రోడ్లు నిర్మించాలని సంకల్పించిన గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తుతానికి 721 ఆవాసాలను గుర్తించి నిర్మాణ పనులకు అంచనాలు ఖరారు చేసింది.  

ప్రాధాన్యతాక్రమంలో నిర్మాణం... : ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రతి గిరిజన ఆవాసానికి మౌలిక వసతులు కల్పించేలా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తండాలవారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉండి, రవాణా వసతి అదమంగా ఉన్న తండాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఐటీడీఏ పరిధిలో 487, మైదాన ప్రాంతాల్లో 234 ఆవాసాలున్నాయి. ఈ ఆవాసాల రోడ్ల కోసం ప్రభుత్వం రూ.450.17 కోట్లు ఖర్చు చేయనుంది.

ఈ నిధులతో 761.21 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనుంది. వీటిని తండా నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తారు. ఇప్పటికే ఖరారైన పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల చివరల్లోగా పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 4,763 ఆవాసాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయాల్సిన అవసరముంది. గతేడాది చివర్లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లు సుమారు 7,988 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉందని తేల్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top