సాక్షి, అల్లూరి జిల్లా: ఎకో టూరిజం పేరుతో తమ జీవితాలను నాశనం చెయొద్దంటూ గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. మెడకు ఉరితాడు వేసుకొని గిరిజనులు నిరసన తెలిపారు. మేఘాలకొండ వ్యూ పాయింట్ దగ్గర నిరసన తెలిపిన గిరిజనులు.. మాడగడ మేఘాలకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అభివృద్ధి పేరుతో అటవీశాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

కాగా, మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును అటవీ శాఖ అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడగడ పంచాయతీ ప్రజలు.. ఈ నెల అక్టోబర్ 6న అరకులోయలోని రేంజర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ను తమ నుంచి లాక్కొని, అటవీశాఖ ఆధీనంలోకి మారుస్తామనడం సరికాదన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి, అటవీశాఖ అధికారులు ఏ రకంగా వ్యూపాయింట్‌ను స్వాధీనం చేసుకుని, నిర్వహిస్తారంటూ వారు ప్రశ్నించారు.



