
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన కనీస ఆదాయ హామీ పథకం దేశంలోని పేదరిక స్థాయిలో సమూల మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోదీ, సర్జికల్ స్ట్రైక్స్ బూటకమంటూ కేసీఆర్‌లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతిచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు విమర్శిస్తోందని ఆయన ప్రశ్నించారు.