గెలుపు గుర్రాల వేట | Congress Party Political ‎Serves In Karimnagar | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాల వేట

Jul 29 2018 8:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Party Political ‎Serves In Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీలో గెలుపు గుర్రాల వేట మొదలైంది. మూడు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు అధిష్టానం నడుం బిగించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధిక స్థానాల సాధనే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. చాలా స్థానాల నుంచి నలుగురు నుంచి 10 మంది వరకు పార్టీ టిక్కెట్‌ కోసం ఏడాది నుంచే పోటీ పడుతున్నారు. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటతో సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి ఆ పార్టీ నాయకత్వం వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీలు వేర్వేరుగా ఉమ్మడి కరీంనగర్‌లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా ఏఐసీసీ కార్యదర్శి, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ల ఇన్‌చార్జి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ కూడా పార్టీ నేతలు, శ్రేణులు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న పలువురిలో సర్వేలు గుబులు రేపుతున్నాయి.
 
రంగంలోకీ ఏఐసీసీ, టీపీసీసీ ప్రతినిధులు
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా.. ఆ పార్టీ హైకమాండ్‌ గెలుపు గుర్రాల వేట చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితులుగా చేప్తున్న ఉ.తెలంగాణ ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌ ఇటీవల కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన 13 నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు, ముఖ్య నాయకులతో మాట్లాడారు. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపైనా ఆ పార్టీలో కసరత్తు జోరందుకుంది. ఇదే సమయంలో ఏఐసీసీ, టీపీసీసీలు అభ్యర్థుల ఎంపికపై వారం రోజులుగా సర్వేలు నిర్వహిస్తుండటం పార్టీ వర్గాల్లో  కలకలం రేపుతోంది.

ఇప్పటికే వారు కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పలువురిని కలిసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏఐసీసీ, టీపీసీసీల వేసిన ఈ రెండు కమిటీల ప్రతినిధులు సైతం వేర్వేరుగానే పర్యటిస్తూ నివేదికలు తయారు చేస్తుండటం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఈ రెండు నివేదికలతోపాటు జిల్లా, రాష్ట్ర కమిటీలు, పార్టీ సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక కోసం రాహుల్‌గాంధీకి సిఫారసు చేస్తారని చెప్తున్నారు. కాగా.. కాంగ్రెస్‌ పార్టీలో ఏడాది ముందు నుంచే టిక్కెట్ల పోరు ఊపందుకోవడం.. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రధానంగా తొమ్మిది చోట్ల ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం.. ఇదే సమయంలో కీలకమైన సర్వేలు జరుగుతుండటం పార్టీలో హీట్‌ పెరిగింది.

టిక్కెట్‌ రేసులో ఎవరెవరు..పరిశీలనలో పలువురి పేర్లు..
జగిత్యాల, మంథని నుంచి టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు పేర్లే ఖాయం కాగా, మిగతా స్థానాల నుంచి ఆశావహుల సంఖ్య పెరిగింది. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, అంజనీప్రసాద్, గందె మాధవి తదితరులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం ఉంది. కోరుట్ల నుంచి కొమిరెడ్డి రాములుతోపాటు డాక్టర్‌ జేఎన్‌ వెంకట్, డాక్టర్‌ రఘు ప్రయత్నం చేస్తున్నారు. రామగుండం నుంచి టికెట్‌ రేసులో మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, హర్కర వేణుగోపాల్‌ కూడా ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి పేరు వినిపిస్తుండగా, ఇక్కడి నుంచి కటకం మృత్యుంజయం, దరువు ఎల్లయ్య కూడా ఆశిస్తున్నారంటున్నారు.

వేములవాడ నుంచి ఏనుగు మనోహర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, బొమ్మ వెంకటేశ్వర్లు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. హుస్నాబాద్‌కు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్లేనంటున్నా సర్వే సందర్భంగా బొమ్మ వెంకటేశ్వర్, బొమ్మ శ్రీరాం పేర్లను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటున్నారంటున్నారు. ధర్మపురి నుంచి లక్ష్మణ్‌కుమార్‌ పేరు ఖాయమంటున్నా ఇతర నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆ పార్టీ సీనియర్లు మరో ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయంటున్నారు. చొప్పదండి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుద్దాల దేవయ్యతోపాటు మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం, బి.శంకర్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఈర్ల కొంరయ్య, డాక్టర్‌ గీట్ల సవితరెడ్డి, సీహెచ్‌ విజయరమణారావు, జి.సురేష్‌ రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడుతుండగా, మానకొండూరు నుంచి మాజీ విప్, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నేత ఆరెపల్లి మోహన్, కవ్వంపెల్లి సత్యనారాయణ పేర్లున్నాయి. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్యాట రమేష్, పరిపాటి రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి పేర్లు వినిపిస్తున్నాయి.

ఏడాది ముందు నుంచే ఎన్నికల వేడి..
కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల్లో ఏడాది ముందు నుంచే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఓ వైపు ‘ముందస్తు’, మరోవైపు జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, సమయం ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయనే ప్రచారం కూడా పోటీకి కారణం అవుతోంది. ఇదే సమయంలో తమకు అనుకూలురైన నాయకులను రంగంలోకి దింపేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పావులు కదపడంలో కూడా వేగం పెంచారు. గ్రూపులు నడుపుతున్న నేతలు ఎవరికి వారుగా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు సమీకరణలపై దృష్టి సారించారు. నియోజకవర్గాలపై పట్టు బిగించేందుకు కూడికలు, తీసివేతలలో పడ్డారు. ఉమ్మడి కరీంనగర్‌లో చాలా మంది సీనియర్‌ నేతల మధ్య సఖ్యత అంతగా లేకపోగా, ఆ పార్టీ కార్యకలాపాలు ప్రధానంగా రెండు, మూడు గ్రూపులుగా సాగుతున్నాయి.

జిల్లా నుంచి ప్రస్తుతం సీనియర్లుగా సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, కటకం మృత్యుంజయం, మాజీ విప్‌ ఆరెపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కొమిరెడ్డి రామ్‌లు, బొమ్మ వెంకటేశ్వర్‌ తదితరులు ఉన్నారు. దీంతో సీనియర్లుగా ఉన్న పలువురికి ఏదో ఒక గ్రూపు ముద్ర పడటం.. సమస్యల వారిగా విభేదించి విడిపోవడం, సమర్దించి కలిసి పోవడంలాంటివి జరుగుతున్నా గ్రూపుల విభేదాలు సమసి పోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు కూడా చర్చనీయాంశంగా మారాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement