నిజామాబాద్‌లో జంపింగ్‌ జపాంగ్‌

Congress Party Leaders Defections In Nizamabad - Sakshi

ఆర్మూర్‌: నమ్మిన సిద్ధాంతాలు.. రాజకీయ విలువలు.. ఆత్మాభిమానంతో కూడుకున్న దృక్పథాన్ని రాజకీయ నాయకులు వదిలేస్తున్నారు. స్వలాభం, అధికారం, డబ్బే పరమావధిగా పార్టీలు మార్చుతూ తమ వ్యక్తిగత విలువలను దిగజార్చుకుంటున్నారు. కప్పల తక్కెడను మరిపిస్తూ రోజుకొక పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొనసాగిన పార్టీ ఫిరాయింపులు ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సైతం కొనసాగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు ఐదు నుంచి పది వేల మంది ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో పార్టీలు మార్చారు. సేవా దృక్పథంతో రాజకీయాల్లో ఉన్నామంటూనే అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ మార్చాలని ఏనాడు ఆలోచన చేయని నాయకులు ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత లబ్ధికే పెద్దపీఠ వేస్తూ పార్టీలను ఫిరాయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఆ పార్టీలోకి చేరికల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు మార్చుతున్న నాయకులకు తెలంగాణ నినాదం ఒక కారణంగా మారింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన రోజుల్లో, తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ఏర్పాటు కాంక్షను తమ శరీరాన్ని కాల్చుకొని ఆత్మబలిదానం చేసిన సందర్భాల్లో సమైక్యవాద పార్టీలను వీడాలని, పార్టీ మార్చాలని ఆలోచన కూడా చేయని పలువురు నాయకులు ప్రస్తుతం తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకొని పార్టీలు ఫిరాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ పార్టీతోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమంటూ కొందరు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీలో చేరామని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కోసం పార్టీలు మారుస్తున్నామని నాయకులు ప్రకటించినా ప్రజలు వాస్తవ పరిస్థితులను నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు. ఇన్ని రోజులు కనిపించని తెలంగాణ సెంటిమెంట్‌ వీళ్లకు ఇవ్వాలనే కనిపించిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మరికొందరు నాయకులైతే పొద్దున ఒక పార్టీలో, మధ్యాహ్నం ఒక పార్టీలో, రాత్రికి ఒక పార్టీలో తిరుగుతూ హల్‌చల్‌ చేస్తున్నారు. పట్టణాల్లో గ్రామాల్లో నాయకులు చెప్పినవారికే ఓటు వేయాలనే పరిస్థితులు కనిపించవు కాని నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే గ్రామాల్లో ఒక చర్చ ప్రారంభమవుతుందన్న ఆలోచనతో పలు పార్టీల నాయకులు ఇలా కప్పదాట్లు వేస్తున్న నాయకులకు ప్యాకేజీలు సమర్పించుకుంటున్నారు. డబ్బులు, పదవులు ఎరవేసుకుంటూ ఆపరేషన్‌ ఆకర్ష్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీల్లో రోజు వందల సంఖ్యలో నాయకులు చేరుతున్నట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించుకుంటున్నారు. ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసి వ్యక్తిగత లబ్ధికోసమే పార్టీలు మారుస్తున్న నాయకుల తీరును ప్రజలు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత బలమైన ఆయుధమైన ఓటుతో ఇలాంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top