ఎమ్మెల్యే గిరి కోసం..

Congress MLC Candidates Wants To Contest In Election Nizamabad - Sakshi

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. మండలి కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీకి కామారెడ్డి స్థానం దాదాపు ఖరారైంది. ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్‌ స్థానాన్ని, టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న వారిలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉండటం ఆసక్తికరంగా మారింది. మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేతలు.. ఇప్పుడు శాసనసభలో కూడా అడు గు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా స్థానాలకు టికెట్‌ రేసులో ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ముందువరుసలో ఉన్నారు. మండలిలో కాంగ్రెస్‌ పక్షనేత షబ్బీర్‌ అలీకి కామారెడ్డి స్థానం దాదాపు ఖరారైంది.

ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకుల లలిత ఆర్మూర్‌ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆమె కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం టికెట్‌ ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన భూపతిరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ స్థానం కోసం పోటీ పడుతున్న ముగ్గురు కాంగ్రెస్‌ నేతల్లో భూపతిరెడ్డి ముందున్నారు.

అలాగే ఈ టికెట్‌ను ఆశిస్తున్న మరో కాంగ్రెస్‌ నేత అర్క ల నర్సారెడ్డి కూడా మాజీ ఎమ్మెల్సీ కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా పరిధిలో ముగ్గురు ఎమ్మెల్సీలు, మరో మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధమవడంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించిన స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన జాబితాలో ఈ నేతల పేర్లు ఉండటం గమనార్హం. ఈ ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు, మరో మాజీ ఎమ్మెల్సీలో పార్టీ అధిష్టానం ఎవరెవరికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ ఎమ్మెల్సీల అంశంపై ప్రత్యేకంగా చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీ జాతీయ నాయకులు కుంతియా ఇదే విషయంపై పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.
 
అభ్యర్థుల తరపున ప్రచారంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు
కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సై అంటుంటే.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లా లో ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ పార్టీ నుం చి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో వీజీ గౌడ్‌ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, రాజేశ్వర్‌రావు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీజీగౌడ్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు, చేవెళ్ల, పరిగి వంటి చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆ పార్టీ బహిరంగ సభలకు హాజరువుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top