ఆదిలాబాద్‌లో మారుతున్న రాజకీయ ‘రంగులు’

Congress Leader Naresh Jadav Join In TRS Party In Adilabad - Sakshi

కారెక్కిన అనిల్‌ జాదవ్‌

నేడు అభ్యర్థులను ప్రకటించనున్న టీఆర్‌ఎస్‌ అధినేత

కాషాయం అభ్యర్థుల జాబితాపై ఆసక్తి

సాక్షి, ఆదిలాబాద్‌: హోలీ వేళ పార్టీల్లోని నాయకుల కండువా రంగులు మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూ ఆసక్తి రేపుతున్నారు. ఈ పరిణామాలు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నాయి. 17వ లోకసభ ఎన్నికల చదరంగం ఆసక్తి కలిగిస్తోంది. నామినేషన్ల ఘట్టానికి మరో నాలుగు రోజుల గడువు మిగిలి ఉండగా, జిల్లాలో తాజా రాజకీయాలు పరిస్థితులు మారిపోతున్నాయి.

పౌర్ణమి ఎవరికి..
పౌర్ణమి వేళ పార్టీల అభ్యర్థుల ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి రంగుల కళ తెస్తాయో.. ఎవరికి చేటు కలిగిస్తాయో అనేదానిపై రాజకీయాల్లో చర్చసాగుతోంది. ఈ రోజుతో అధికార పార్టీలో అభ్యర్థులు ఎవరనేది తేలనుంది. కాంగ్రెస్‌ ఇదివరకే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా రాథోడ్‌ రమేశ్, పెద్దపెల్లి పార్లమెంట్‌ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్‌ను ప్రకటించింది. అన్ని పార్టీలకంటే ముందుగా కాంగ్రెస్‌ ఈనెల 16నే అభ్యర్థులు ఎవరనేది స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది మాత్రం ఇప్పటివరకు తేలలేదు. గులాబీ పార్టీ నుంచి ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీ గొడం నగేశ్‌నే దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక పెద్దపెల్లి విషయంలో అధికార పార్టీలో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇక్కడి నుంచి మాజీ ఎంపీ జి.వివేకానంద మొదటినుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించలేదనే విమర్శలను జి.వివేకానంద ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జి.వివేకానందకే టిక్కెట్‌ కేటాయిస్తుందా..లేదంటే ఇక్కడి నుంచి మరొకరికి అవకాశం ఇస్తుందా అనే విషయంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నుంచి ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఇటీవల ఆ పార్టీలో చేరిన సోయం బాపూరావుకే టికెట్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దపెల్లి నుంచి ఎవరిని బరిలోకి దింపుతారనేది తేలాల్సి ఉంది.

 జంపింగ్‌ జపాంగులు..
ఎన్నికల వేళ జంపింగ్‌ జపాంగులు పెరిగిపోతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌లో గులాబీ రెపరెపలాడింది. ఒక ఆసిఫాబాద్‌లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందారు. ఇటీవల సక్కు కూడా అధికార పార్టీకే జై కొట్టడంతో పార్లమెంట్‌ నియోజకవర్గం పూర్తిగా గులాబీమయమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది శాసనసభ స్థానాలకుగాను కనీసం ఆసిఫాబాద్‌ ఒక్క స్థానంలోనైనా గెలుపొందడంతో గౌరవం మిగిలిందనుకున్న కాంగ్రెస్‌కి ఆత్రం సక్కు ఎపిసోడ్‌ మింగుడుపడడం లేదు. రాథోడ్‌ రమేశ్‌కు ఆదిలాబాద్‌ ఎంపీ టిక్కెట్‌ కేటాయించడంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నరేశ్‌జాదవ్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన అనిల్‌ జాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌ రెబల్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.

కాగా బుధవారం అనిల్‌ కూడా బోథ్‌ నియోజకవర్గ నేతలు, నాయకులతో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేశ్‌ సమక్షంలో అనిల్‌ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బోథ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ ఆశించారు. అయితే రాథోడ్‌ రమేశ్‌కు కేటాయించడంతో ఆయన బీజేపీ గూటికి చేరారు. దాదాపు బీజేపీ నుంచి ఆయన పేరే ఖరారయ్యే అవకాశం ఉంది.

 ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ ఈ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలకాలంలో కాంగ్రెస్‌ కొత్త జిల్లాల వారీగా డీసీసీలను నియమించింది. ఆదిలాబాద్‌ నుంచి భార్గవ్‌దేశ్‌పాండే, నిర్మల్‌ నుంచి రామారావు పటేల్‌ను నియమించగా, కుమురంభీం ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కును నియమించగా ఆయన టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో జిల్లాలో కాంగ్రెస్‌ దిక్కులేని నావలా తయారైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఆయా నేతలు ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితి. టీఆర్‌ఎస్‌ నుంచి ఆదిలాబాద్‌ అభ్యర్థి ఎవరైనప్పటికీ ఆ పార్టీకి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలతోపాటు బలమైన కేడర్‌ ఉండడం కలిసివచ్చే అంశం. సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం గెలుపు కోసం ఇన్‌చార్జి బాధ్యతలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించగా, మాజీ మంత్రి జోగు రామన్న, ఇతర ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. బోథ్‌లో అనిల్‌ జాదవ్‌ చేరికతో మరింత బలం చేకూరింది. బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్‌లో తప్పితే బీజేపీకి సరైన కేడర్‌ లేకపోవడం మైనస్‌ పాయింట్‌గా నిలుస్తోంది.

ఇక పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ నుంచి ఎ.చంద్రశేఖర్‌ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పెద్దపల్లి, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని ఉన్నాయి. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు ఎదురీత తప్పేలా లేదు. ఇక్కడ డీసీసీ అధ్యక్షురాలుగా కొక్కిరాల సురేఖ వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే పెద్దపల్లి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్‌కు టికెట్‌ ఇవ్వడం పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. పార్టీ అధిష్ఠానం సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తూ ఐదుసార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా పని చేసిన ఎ.చంద్రశేఖర్‌ను ఇక్కడ బరిలోకి దించడం ఆసక్తి కలిగిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చిన పక్షంలో ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top