
మహిళా కండక్టర్ దారుణహత్య
కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ కిరాతక భర్త. ఆదివారం పట్టపగలు..అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణహత్య చేశాడు.
- భర్తే హంతకుడు
- మనస్పర్థల వల్లే దారుణం
- కాచిగూడలో ఘటన
కాచిగూడ,న్యూస్‌లైన్: కట్టుకున్న భార్యను కడతేర్చాడో ఓ కిరాతక భర్త. ఆదివారం పట్టపగలు..అంతా చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణహత్య చేశాడు. బుద్ధిమంతుడిలా వెంటనే పోలీసుస్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి కాచిగూడ ఏసీపీ రంజన్త్రన్‌కుమార్, తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం..ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం ప్రాంతానికి చెందిన జమునారాణి (41) కాచిగూడ డిపోలో కండక్టర్.
ఈమెకు గతంలో వివాహం జరగ్గా..కూతురు పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. ఉద్యోగరీత్యా కొంతకాలంగా నగరంలో ఉంటోంది. కాగా కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2003లో డిస్మిస్ అయిన వెంకటేష్‌నాయక్ (44)తో జమునారాణికి పరిచయం ఏర్పడింది. వెంకటేష్‌నాయక్ మొదటి భార్య కవిత అతన్ని వదిలేయడంతో జమునారాణిని 2004లో రెండోవివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది రెండో వివాహమే.
గత పదేళ్లుగా జమునారాణి-వెంకటేష్‌నాయక్ దంపతులు నగరంలో కలిసే ఉన్నారు. వీరికి పాప కూడా ఉంది. వెంకటేష్‌నాయక్ ఉద్యోగం లేకపోవడంతో పనిచేయకుండా తాగుడుకు బానిసై నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. నాలుగునెలల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవజరగడంతో జమునారాణి ఉద్యోగానికి సెలవుపెట్టి వెళ్లిపోయింది. ఇలా దూరంగా ఉంటుండగా..జమున ఇటీవలే నగరానికొచ్చి బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్‌హాస్టల్‌లో ఉం టూ కండక్టర్‌గా పనిచేస్తోంది.
ద్వేషం పెంచుకొని : భార్య విధులకు వస్తుందన్న విషయం తెలుసుకున్న వెంకటేశ్ ఆమె వద్దకు వెళ్లి ఇంటికి రావాలని కోరాడు. దీనికి నిరాకరించడంతో ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను హత్య చేయాలని పథకం వేసి ఆదివారం మధ్యాహ్నం బర్కత్‌పురలోని హాస్టల్ నుంచి విధులకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ వస్తుండగా సరిగ్గా కాచిగూడ బస్‌స్టేషన్ వద్ద జమునారాణిపై విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి పొడిచాడు.
ఈ ఘటన చూసిన పలువురు భయంతో పరుగులుదీశారు. ఘటన జరిగిన వెంటనే వెంకటేష్‌నాయక్ కాచిగూడ పోలీసుస్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న జమునారాణిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఘటనాస్థలాన్ని ఏసీపీ రంజన్త్రన్‌కుమార్, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ జగదీశ్వర్‌రావు, క్లూస్‌టీం సిబ్బంది, కాచిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్‌రావు తదితరులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆమె మృతిపట్ల డిపో కార్మికులు, తోటి ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.