కొండగట్టు ప్రమాదం; బస్సు కండక్టర్‌ స్పందన

Conductor On Kondagattu Bus Accident - Sakshi

సాక్షి, కరీంనగర్‌: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు 60 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డ కండక్టర్‌ పరమేశ్వర్‌ మాట్లాడుతూ.. బస్సు ఫిట్‌నెస్‌ సరిగా లేకపోవడంతో.. ఘాట్‌ రోడ్‌లో బ్రేక్‌ ఫెయిల్‌ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని అన్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్‌ గట్టిగా అరిచాడని వెల్లడించారు. బస్సు కండీషన్‌పై, ప్రయాణికుల రద్దీపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తమపై ఒత్తిడి పెంచినట్టు తెలిపారు.

ఘాట్‌ రోడ్డులో శ్రావణమాసం నుంచే బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. బస్సులో మొత్తం 114 మంది ఉన్నారని.. అందులో 96 మందికి టికెట్‌ ఇచ్చానని పేర్కొన్నారు. నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని.. జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంధనం పొదుపులో శ్రీనివాస్‌ ఉత్తమ డ్రైవర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇంధనం పొదుపు కోసం డ్రైవర్‌ ఘూట్‌ రోడ్‌లో న్యూట్రల్‌లో వచ్చాడనే ఆరోపణలను పరమేశ్వర్‌ ఖండించలేదు. ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top