
ఏలూరు జిల్లా: ఫోన్‌లో కాకుండా ఆధార్ కార్డు ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని అడిగినందుకు కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు పరిధిలో శనివారం జరిగింది. విజయవాడ విద్యాధరపురం డిపో బస్సు విజయవాడ–విస్సన్నపేట మధ్య నడుస్తుంది. నూజివీడులో సాయంత్రం విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కిన మహిళను కండక్టర్ ఎంవీ ప్రసాద్ ఆధార్ కార్డు చూపించమని అడగ్గా ఆమె ఫోన్‌లో చూపించింది.
కండక్టర్ ఒరిజనల్ గాని, జిరాక్స్ గాని చూపించాలని, లేకపోతే టికెట్ తీసుకోవాలని మహిళకు స్పష్టం చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ..వాటర్ బాటిల్‌తో కండక్టర్‌ను కొట్టింది. అంతటితో ఆగక...చేతులతో కూడా దాడి చేసింది. బస్సులోని మహిళలు దాడి చేస్తోన్న మహిళను నిలువరించారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు కొన్నంగుంట వద్ద బస్సును నిలిపివేశారు. బస్సులోని ప్రయాణికులు మహిళకు నచ్చజెప్పడంతో ఆమె టికెట్ తీసుకుంది. ఘర్షణ సద్దుమణిగిన తరువాత బస్సు విజయవాడకు బయలుదేరింది.