పింఛన్ల తొలగింపుపై ఆందోళన | concerns on termination of pension | Sakshi
Sakshi News home page

పింఛన్ల తొలగింపుపై ఆందోళన

Nov 9 2014 3:55 AM | Updated on Sep 2 2017 4:06 PM

అర్హులకు ఆసరా పథకంలో పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆందోళన బాటపట్టారు.

లోకేశ్వరం :  అర్హులకు ఆసరా పథకంలో పింఛన్లు మంజూరుకాకపోవడంతో ఆందోళన బాటపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న పింఛన్లను తొలగించడంతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామానికి చెందిన వితంతులు, వృద్ధులు, వికలాంగులు శనివారం లోకేశ్వరం పాత బస్టాండ్ ఏరియాలో మూడు గంటల పాటు రోడ్డుపై బైటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్‌డౌన్ నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు.

దీంతో లోకేశ్వరం నుంచి నిర్మల్, భైంసా పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అర్హులందరికీ పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆందోళనకారులు డెప్యూటీ తహశీల్దార్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాయపూర్‌కాండ్లీ సర్పంచ్ రాధిక సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, నాయకులు భీంరావు, నాలం గంగయ్య, ఆనందం, సాయి, నందకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 మందమర్రిలో మండలంలో..
 మందమర్రి : అర్హుల పింఛన్లను తొలగించడాన్ని  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు శనివారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు మాట్లాడుతూ వివిధ సర్వేల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అర్హుల పింఛన్లలో కోత పెట్టిందన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 4,800 మందికి పింఛన్లు వస్తుండగా ప్రస్తుతం వాటిని 2100 కుదించారని తెలిపారు.

గతంలో పింఛన్లు పొందిన వికలాంగుల పేర్లు సైతం జాబితా నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన పాలకులు ఆచరణలో చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.

 గంట పాటు రాస్తారోకో..
 పింఛన్ల తొలగింపుపై భగ్గుమన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై సైతం రాస్తారోకో చేపట్టారు. దాదాపు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఒక దశలో ఆయా పార్టీల నాయకులు, పింఛన్లు రాని బాధితులు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి యత్నించారు. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది.

అనంతరంలోనికి వెళ్లిన నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొత్కు సుదర్శన్, సట్ల రవీందర్, సంగి సంతోష్, తుమ్మ శ్రీశైలం, నోముల ఉపేందర్‌గౌడ్, టీడీపీ నాయకులు పైడిమల్ల నర్సింగ్, హన్మంతు, సది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement