కమ్యూనిస్టు నేత శివరామిరెడ్డి కన్నుమూత 

Communist leader Shivarami Reddy passed away - Sakshi

మహాప్రస్థానంలో కుటుంబసభ్యుల మధ్యముగిసిన అంత్యక్రియలు 

నివాళులర్పించిన సురవరం, చాడ, ఓబులేశు, సజ్జల రామకృష్ణారెడ్డిలు  

కన్నీటిపర్యంతమైన ఉభయ రాష్ట్రాల కమ్యూనిస్టు నాయకులు 

సాక్షి,హైదరాబాద్‌: సీనియర్‌ కమ్యూనిస్టు నేత, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) రాజధానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివరామిరెడ్డి గురువారం బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసిన వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వైద్యులు డా. గురుప్రసాద్‌ శుక్రవారం ప్రకటించడంతో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శివరామిరెడ్డికి భార్య కొండమ్మ, కుమార్తెలు కల్పన, భగీరథి, ఝాన్సీ కుమారుడు భరద్వాజ్‌ రెడ్డి, అలుళ్లు, కోడళ్లు్ల, మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. శివరామిరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం సాయంత్రం 3గంటల వరకూ బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లోని ఆయన కుమార్తె సజ్జల భగీరథి నివాసంలో ఉంచారు.

ఇంటికి చేరుకున్న ఎన్‌ఎస్‌ భౌతికాయం చూడగానే ఆయన భార్య కొండమ్మ దుఖాన్ని ఆపుకోలేకపోయారు. ఎన్‌ఎస్‌ కుమారుడు భరద్వాజ్, కుమార్తెలు ఝాన్సీ, భగీరథిలు, అల్లుడు సజ్జల దివాకర్‌ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. శివరామిరెడ్డిని కడసారిగా చూసేందుకు ఆయన బంధుమిత్రులు, సీపీఐ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సురవరం సతీమణి విజయలక్ష్మి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ ఏఐటీయూసీ కార్యదర్శి గుజ్జుల ఓబులేశు, సీపీఐ కడప జిల్లా కా>ర్యదర్శి జి.ఈశ్వరయ్యలు పార్టీ జెండాను శివరామిరెడ్డి భౌతికాయంపై ఉంచి విప్లవ జోహర్లు అర్పించారు. నివాళులర్పించిన వారిలో సంపాదకులు ఏబీకే ప్రసాద్, గజ్జల అశోక్‌రెడ్డి, జె. శివాజీరెడ్డి, డాక్టర్‌ ఎన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఎన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఎన్‌ విశ్వేశ్వర్‌ రెడ్డి, ఎన్‌ సునీల్‌ రెడ్డి, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, పాలెం రఘునాథరెడ్డి, పి. సుదర్శన్‌ రెడ్డి సీపీఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి, డాక్టర్‌ డి. సుధాకర్, ఎన్‌ బాలమల్లేశ్, ఎల్‌. నాగ సుబ్బారెడ్డి, డబ్ల్యూ.వి. రాము, చెన్నకేశవరెడ్డి, వెంకట శివ, మైదుకూరు రమణ, డాక్టర్‌ సూరారెడ్డి, ఈటీ నరసింహ, ప్రజాపక్షం సంపాదకులు కె. శ్రీనివాసరెడ్డి, సీఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు చెన్నకేశవరావు, కేవీఎల్, డాక్టర్‌ రజని, ఐజేయూ నాయకురాలు అజిత తదితరులు ఉన్నారు.  

తొలితరం ప్రజాప్రతినిధి..  
వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి(ఎన్‌ఎస్‌) స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నేత. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1952లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర నేతగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. 2000 ఫిబ్రవరి1 నుంచి సీఆర్‌ ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలో ఉంటూ నీలం రాజశేఖర్‌రెడ్డి, వైవీ కృష్ణారావుల అభినందన సంచికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. 

వైఎస్‌ జగన్‌ సంతాపం 
సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top