ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

Collector Shivalingaiah Issue Memo to Headmaster and Teacher - Sakshi

హెచ్‌ఎంతో పాటు మరో టీచర్‌కు మెమో జారీ

కురవి ఎంపీడీఓ కార్యాలయం, జెడ్పీ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ

కురవి: మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం ఎండీ వాహిద్, బయోలాజికల్‌ సైన్స్‌ బోధించే ఉపాధ్యాయురాలు గిరిజ పనితీరుపై కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కురవిలోని ఎంపీడీఓ కార్యాలయంతో పాటు జెడ్పీహైస్కూల్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. జెడ్పీహైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల గదికి వెళ్లి డిజిటల్‌ తరగతుల నిర్వహణ, పదో తరగతి విద్యార్థులకు బోధనపై ఆరా విద్యార్థులతో పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలను అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్‌ ఉపాధ్యాయురాలు గిరిజపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. ఇక పాఠశాలకు మైదానం పెద్దగా ఉండడంతో కిచెన్‌గార్డెన్‌లో భాగంగా మునగ, కరివేపాకు, తదితర మొక్కలను పెంచాలని సూచించినా పట్టించుకోకపోవడంపై హెచ్‌ఎం వాహిద్‌కు సైతం మెమో జారీ చేశారు.

తిరిగి వారం రోజుల్లో పాఠశాలకు వస్తానని, 60 రోజుల ప్రణాళిక ప్రకారం పదో తరగతి  విద్యార్థులకు బోధించాలని, వంద శాతం ఫలితాలు రావాలని, లేనట్‌లైతే సబ్జెక్టు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మండలంలో 1800 ఖాతాలకు పట్టాదారు పాసుపుస్తకాలు అందచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని బాగా చేశారని అదే విధంగా గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రెండు గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, నర్సరీలను 7వ తేదీలోపు నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సోమశేఖరశర్మ, డీపీఓ రంగాచారి, ఆర్డీఓ కొమురయ్య, ఇన్‌చార్జ్‌ తహసీల్ధార్‌ మాల్యా, ఎంపీడీఓ కె.ధన్‌సింగ్, డీపీఆర్‌ఓ అయూబ్‌అలీ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top