ఖానాపూర్ మండలం సత్తన్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.
ఖానాపూర్ : ఖానాపూర్ మండలం సత్తన్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నిర్వహించిన అత్యవసర సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు, సత్తన్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ బెల్లాల చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఇద్దరు డెరైక్టర్లతోపాటు సంఘం పరిధిలోని రైతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు రుణాల కోసం కార్యాలయానికి వస్తున్నారని, పెండింగ్‌లో ఉన్న రుణాలు చెల్లిస్తే నూతనంగా రుణాలు ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. లేకపోతే రుణమాఫీపై నిర్ణయం వచ్చే వరకు వేచిచూడాలని పేర్కొన్నారు. దీంతో ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోతే ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సీఈవో నారాయణ పలు అంశాలపై తీర్మానం చేశారు.
వారందరూ అనర్హులే..
సహకార సంఘానికి చెందిన పది మంది డెరైక్టర్లు ఓవర్ డ్యూ ఉన్నారని, లీగల్ ఓపీనియన్ ప్రకారం ఖరీఫ్ డ్యూడేట్ ఫిబ్రవరి 23వ తేదీనఈ విషయాన్ని సంఘం కార్యాలయంలోని నోటీసు బోర్డులో పెట్టామని చైర్మన్ పేర్కొన్నారు. మళ్లీ ఓవర్ డ్యూ తేదీ మే 31 కూడా చివరిసారిగా నోటీసు బోర్డులో పేర్కొన్నామన్నారు. అయినాడబ్బులు చెల్లించలేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు, కో-ఆపరేటీవ్ సొసైటీ చట్టం సెక్షన్ 21-ఏ, 21-ఏఏ లేదా 21-బీ 1964 చట్టం ప్రకారం మే 31వ తేదీ నుంచి డెరైక్టర్లుగా వారంతా అనర్హులుగా పరిగణించబడుతారని చైర్మన్ ప్రకటించారు.
రైతుల ఆగ్రహం
ఈనెల 16న చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఉన్నందు వల్ల నే చంద్రశేఖర్‌రెడ్డి పదవిని కాపాడుకోవడానికి తప్పుడు సమావేశం ఏర్పాటు చేశారంటూ ఆగ్రహంతో సమావేశంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. అనంతరం 222 రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో సంఘటనా స్థలానికి సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై సునీల్ చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం రైతుల కోరిక మెరకు సంబంధిత డీసీవో సూర్యచందర్‌రావుతో ఫోన్‌లో సీఐ జీవన్‌రెడ్డి రైతులతో మాట్లాడించారు. సమావేశం నివేదికను, చైర్మన్ తీసుకున్న నిర్ణయాలు తాము పరిశీలిస్తామని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని డీసీవో చెప్పడంతో రైతులు శాంతించారు.
వైస్ చైర్మన్, కోశాధికారి ఎన్నిక
సర్వసభ్య సమావేశంలో కో-ఆప్షన్ సభ్యులుగా ప్రకటించిన ఎనిమిది మందితో చైర్మన్, ఇద్దరు డెరైక్టర్‌లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్‌గా ఎన్నిక యిన వారి నుంచి పాత ఎల్లాపూర్‌కు చెందిన కొప్పుల మంజులను వైస్ చైర్మన్‌గా, బావాపూర్(కే)కు చెందిన దూస శంకర్‌ను కోశాధికారిగా ఎన్నుకున్నట్లు సభ్యులు ప్రకటించారు.