నేడో రేపో కేబినెట్‌

CM KCR Meets CS SK Joshi - Sakshi

మంత్రివర్గ భేటీపై అస్పష్టత

శనివారంలోపు నిర్వహించే అవకాశం.. అన్ని అంశాలపై సీఎం కేసీఆర్‌ పరిశీలన

సీఎస్‌ ఎస్‌.కె. జోషితో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం నిర్వహణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషితో మంగళవారం సీఎం సమావేశమయ్యారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. వీటి ఆధారంగా కేబినెట్‌ భేటీలో పెట్టాల్సిన ఎజెండాను రూపొందిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మేలు జరిగే ఏ అంశాన్నీ వదలకుండా అన్ని ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై అంచనాకు వస్తున్నారు. వివిధ వర్గాలకు ప్రకటించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, బీసీలు, ఇతర వర్గాల ‘ఆత్మగౌరవ భవనాల’కు భూమి కేటాయింపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి, ఇతర డిమాండ్లు, కొత్త ఉద్యోగాల ప్రకటన, ప్రత్యేక కార్యక్రమాలకు నిధుల కేటాయింపులు... మొత్తంగా వచ్చే ఎన్నికల్లో సానుకూలంగా ఉండే అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే మంత్రివర్గ సమావేశం కచ్చితంగా ఏ రోజు జరుగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ప్రగతి నివేదిన సభ’సెప్టెంబర్‌ 2న జరగనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ముందే కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్లు తెలిసింది. కేసీఆర్, మంత్రులు పూర్తిగా బహిరంగ సభపైనే దృష్టి పెడితే మాత్రం ఆ తర్వాతే కేబినెట్‌ భేటీ ఉండనుంది.

గవర్నర్‌తో కేసీఆర్‌ సమావేశం..
సీఎం కేసీఆర్‌ మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ పర్యటన అంశాలను వివరించారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నిర్వహణ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది.

సీఎంతో బీజేపీ నేతల భేటీ...
హైదరాబాద్‌లో వాజ్‌పేయి విగ్రహం నెలకొల్పాలని బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు మంగళవారం ప్రగతి భవన్లో సీఎంను కలిశారు. వాజ్‌పేయి విగ్రహంతోపాటు స్మారక మందిరం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top