గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి : కేసీఆర్‌

CM KCR Meet With Newly Elected ZP Chairman And Vice Chairmans - Sakshi

అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌కు రూ. 10 కోట్లు : కేసీఆర్‌

కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్మన్‌, వైస్ చైర్ పర్సన్లతో సీఎం సమావేశం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించాలి

జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు సీఎం దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌ : పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను సీఎం కూలంకశంగా వివరించారు. 

జిల్లా పరిషత్‌ చైర్మన్లగా, వైఎస్‌ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు అందరిని అభినందించారు. ఈ ఐదేళ్లలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తేను మంచి పేరు వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవరపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని సిఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణా కార్యక్రమం నిర్విస్తామని ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్థిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

‘చాలా కాలం పంచాయితీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయి. పారిశుద్ధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా వుండేది. దురదృష్ట వశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్రత వాతావరణం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు....గ్రామాల్లోనే వుంది. గ్రామాలు మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి. మీ అందరు జులై నెలలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ లోపుగా మీరంతా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ లొ శిక్షణకు పోవాలి. దానికి మా అధికారులు ఒక మంచి కోర్స్ డిజైన్ తయారు చేస్తారు. గ్రామ పంచాయితీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయితీ రాజ్ చట్టం చాలా కఠినంగా వుంది. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తేనే, మూడేళ్ళ తరువాత ఆయన సేవలను క్రమబద్దీకరిస్తాం. పంచాయితీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్ధిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆర్నెల్లలో పూర్తి మార్పు కనబడాలి’  అని సిఎం చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎ.జీవన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, షకీల్, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, నల్లాల ఓదేలు, ఉమా మాధవరెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top