తెలంగాణకు కొత్త వక్ఫ్‌ చట్టం

CM KCR bats for fresh State Wakf Act  - Sakshi

వక్ఫ్‌ బోర్డు, అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర వక్ఫ్‌ చట్టానికి అనుగుణంగా తెలంగాణకు కొత్త వక్ఫ్‌ చట్టాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలోని వక్ఫ్‌ ఆస్తులన్నింటినీ వెంటనే గుర్తించి, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్‌ భూములకు ప్రహరీ/కంచె నిర్మించాలని, వాటిని కలెక్టర్ల స్వాధీనంలో ఉంచాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వక్ఫ్‌ భూములను గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ వక్ఫ్‌ బోర్డు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. గురువారం ప్రగతి భవన్‌లో వక్ఫ్‌ బోర్డు సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్‌ ఆస్తులు ఎక్కుడున్నాయో, ఎలా ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని ఆదేశించారు. కబ్జాలకు గురైన వక్ఫ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం ఖరారు చేయాలని, ఈ విషయంలో ప్రభు త్వం అండగా ఉంటుందని వెల్లడించారు. రెవెన్యూ శాఖ, వక్ఫ్‌ బోర్డు మధ్య వివాదం ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూమి కాని, ఆస్తి కాని ఒకసారి వక్ఫ్‌ ఆస్తిగా నిర్ధారణ జరిగితే ఎప్పటికైనా వక్ఫ్‌ ఆస్తిగానే ఉంటుందని సీఎం అన్నారు.  

కలెక్టర్లు సహకరించాలి
వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు 2 కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఒక కమిటీ రికార్డుల నిర్వహణను, మరో కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులను గుర్తించి, రక్షించే చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు. వక్ఫ్‌ భూముల రక్షణ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వక్ఫ్‌ బోర్డు పనితీరు ఎలా ఉండాలో, బోర్డు విధి విధానాలు ఎలా ఉండాలో స్పష్టత రావాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే వక్ఫ్‌ బోర్డు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుని భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయాలని సూచించారు. సమావేశంలో వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ ఎండీ సలీం, సీఈఓ మన్నన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్‌ జలీల్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, బోర్డు సభ్యులు మజామ్‌ ఖాన్, అక్బర్‌ నిజాముద్దీన్, సయ్యద్‌ జకీరుద్దీన్, ఇక్బాల్, అన్వర్, నిసాన్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top