ఇదేం తీరు?


గజ్వేల్/ములుగు: గజ్వేల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘నేను ఫామ్‌హౌస్ నుంచి వస్తుంటే తొవ్వల.. మర్కుక్‌లో మురుగునీటి కాల్వలు బాగాలేవు... స్పెషల్ డ్రైవ్‌లు చేసినమన్నరు... ఫలితమేముంది... ఇదేం బాగాలేదు... ఏంచేస్తున్నారు మీరంతా..?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.



ములుగు మండల కేంద్రంలోని అటవీశాఖ పరిశోధనా కేంద్రంలో నియోజవర్గంలోని వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో సీఎం చేసిన వ్యాఖ్యలివి. ‘ఏం చేస్తారో నాకు తెల్వదు.. గజ్వేల్ పట్టణంతోపాటు మండలంలోని గ్రామాలు, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్ మండల కేంద్రాలు, గ్రామాలన్నీ సం పూర్ణ పారిశుద్ధ్యానికి ప్రతీకలుగా నిలవాలి...అద్దంలా మారాలి’ అంటూ ఆదేశించారు. ముందుగా గజ్వేల్ పట్టణం లో ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలె...అంటూ ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావుకు సూచించారు.



అంతేకాకుండా చెట్లు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టండి...అన్ని వర్గాల సహకారం తీసుకోండి....అంటూ ఆదేశించారు. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో యుద్ధప్రాతికదికన మొక్కల నాటడానికి చర్యలు చేపట్టాలన్నారు.  పట్టణంలోని ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్‌లోని 132/33కేవీ సబ్‌స్టేషన్ వరకు, ఇందిరాపార్క్ అంగడిబజార్ నుంచి కోటమైసమ్మ గుడి వరకు కూడా  మొక్కలు నాటి వాటికి కం చెలను ఏర్పాటు చేయాలన్నారు.



రోడ్డు విస్తరణకు స్థానికుల సహకారాన్ని కోరాలని తెలిపారు. మొక్కల పరిరక్షణకు రోడ్డు పక్కన బోరుబావులను తవ్వించి వాటి ద్వారా నీటిని అందించాలన్నారు. వీటి పరిరక్షణ బాధ్యత పూర్తిగా నగర పంచాయతీ కమిషనర్‌దేనని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంకానర్గీస్, అటవీశాఖ అధికారి సోనీబాల, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి భూంరెడ్డి, నాయకులు జహంగీర్, అంజిరెడ్డి, మాదాసు శ్రీనివాస్, దేవి రవిందర్ తదితరులు పాల్గొన్నారు.



 మంచినీటికి శానా తిప్పలైతుంది... - సీఎంతో మర్కుక్ మహిళల ఆవేదన

 ములుగు మండలం మర్కుక్ గ్రామాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకసిక్మంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధి గుండా కాలినడకన తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగునీటి కాల్వలను పరిశీలించారు. సీఎం ఆకస్మిక సందర్శనతో గ్రామస్తులు  ఒక్కసారిగా ఆనందోత్సహాలకు గురయ్యారు.



ఈ సందర్భంగా పలువురు మహిళలు ‘గ్రామంలో.. మంచినీళ్లు దొరకక శాన తిప్పలైతుంది సారు...మేం పదిమందిమి కలిసి సొంత పైసలతో బోరు వేయించుకున్నం’ అని కొందరు నిట్టూర్చగా...మరి కొందరు ‘మాకు నల్లా నీళ్లు వస్తలేవు... మా ఇబ్బంది తీర్చండి...’ అంటూ సీఎంతో వేడుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్ మర్కుక్‌లో వారం రోజుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అదేవిధంగా మహిళా సంఘాల గురించి సీఎం ఆరా తీశారు.



 సంఘాలకు భారీ ఎత్తున పథకాలను వర్తింపజేసీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మరో రైతువద్దకు వెళ్లి..పెద్దాయనా నీకేం కావాలే...అంటూ సీఎం ప్రశ్నించగా కరెంటు సరిగా వస్తలేదు సారూ...కరెంటు మంచిగియ్యాలే...అంటూ వేడుకున్నారు....దీనిపై స్పందించిన కేసీఆర్ కరెంటు సరఫరా తీరు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గ్రామస్తులతో మాట్లాడుతూ..అంతా కలిసి శ్రమదానం చేసుకుందాం...మోరీలు బాగు చేసుకుందాం...కొద్ది రోజుల్లో నేను కూడా మీ ఊరికి వస్తా..అంటూ పేర్కొన్నారు.   



 ములుగు అటవీ కేంద్రంలో జింకలను పెంచండి

 పోచారం అభయారణ్యంలోని సుమారు 200కుపైగా జింకలను ములుగులోని అటవీశాఖ పరిశోధన కేంద్రంలోకి తరలించి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. శుక్రవారం ఈ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో సిల్వి కల్చరిస్ట్ ప్రియాంకవర్గీస్, డీఎఫ్‌ఓ సోనిబాల తదితరులతో మాట్లాడుతూ పర్యావరణం వికసించేలా పోచారం అభయారణ్యం నుంచి ఇక్కడికి జింకలను తరలించి పెంచాలని సూచించారు. అదేవిధంగా ఇక్కడి కేంద్రానికి పెద్ద ఎత్తున మొక్కలను తీసుకువచ్చి నిల్వ చేసి నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, కొండపాక, జగదేవ్‌పూర్ మండలాలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తన ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డిని సీఎం ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top