నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ! | Sakshi
Sakshi News home page

నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!

Published Sat, Jul 27 2019 8:42 AM

Civil Supply Commissioner Orders To Not Issue The New Food Security Cards In Medak - Sakshi

సాక్షి, మెదక్‌: కొత్తగా ఆహార భద్రత కార్డుల(ఎఫ్‌ఎస్‌సీ) జారీకి బ్రేక్‌ పడింది. దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సుమారు రెండు నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ ఇటీవల అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతానికి కొత్త రేషన్‌ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా కార్డులందక నిరుపేద కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి.

కొత్తగా రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్జీలను రెండు నెలల క్రితం వరకు యుద్ధప్రాతిపదికన క్లియర్‌ చేసిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దరఖాస్తుల పరిశీలనపై ఏ ఒక్క అధికారి దృష్టిసారించడం లేదు. ఆరోగ్యశ్రీ, కుటుంబ వార్షిక ఆదాయ నిర్ధారణ, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉపకార వేతనాల జారీలో ఆహార భద్రత కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ క్రమంలో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేయొద్దని ఆదేశించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటిన్నర నెలలుగా జిల్లాలో సుమారు వేలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పలువురు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు.

పెండింగ్‌లో 2,658 దరఖాస్తులు
ఆహారభద్రత కార్డుల జారీకి సంబంధించి అధికారులు మూడంచెలుగా పరిశీలన చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా మండలాల వారీగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు(ఆర్‌ఐ), ఆ తర్వాత ఎమ్మార్వో, అనంతరం జిల్లా స్థాయిలో డీసీఎస్‌ఓ పరిశీలించి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని కమిషనర్‌కు పంపుతారు. అక్కడ పరిశీలించి అప్రూవల్‌ ఇస్తే.. ఆహార భద్రత కార్డులు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం జూన్‌ నెల నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు ఆర్‌ఐల వద్ద 1290, ఎమ్మార్వోల వద్ద 213, డీసీఎస్‌ఓ వద్ద 1,155.. మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 

మార్పు చేర్పుల అర్జీలు సైతం
జిల్లాలో రేషన్‌ షాపులు 521 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు 2,14,165 ఉండగా.. ఇందులో అంత్యోదయ కార్డులు 13018, అన్నపూర్ణ కార్డులు 88, ఎఫ్‌ఎస్‌సీ కార్డులు 2,01,059 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇదివరకు ఆహార భద్రత కార్డులు జారీ అయి కుటుంబ సభ్యులను అందులో చేర్చాల్సి(మెంబర్‌ అడిషన్‌) ఉన్న వారికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇలాంటి మార్పుచేర్పుల దరఖాస్తులను కూడా మూడంచెలుగా పరిశీలన చేయాల్సి ఉండగా.. ప్రక్రియ నిలిచిపోయింది. మెంబర్‌ అడిషన్‌కు సంబంధించి ఆర్‌ఐల వద్ద 1,765, ఎమ్మార్వో వద్ద 555, డీసీఎస్‌ఓ వద్ద 2,104.. మొత్తం 4,424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు
కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ నిలిచిపోవడంతో జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 20 శాతం మేర కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి ఆదేశాలు ఇవ్వాలని నిరుపేదలు కోరుతున్నారు.

ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం
రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆహార భద్రత కార్డుల జారీని నిలిపివేశాం. మళ్లీ మొదలు పెట్టాలని ఆదేశాలు వస్తే.. వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. రెండు నెలల క్రితం వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు. ఒక్క మెదక్‌ జిల్లాలోనే క్లియర్‌గా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో పది వేలు, అంతకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
– సాధిక్, డీటీసీఎస్

Advertisement
Advertisement